క్షణమొక గండంగా
దినమొక యుగంలా
అనుక్షణం, అడుగడుగునా
ఎదురుచూపులో, ఈసడింపులో నిరాదరింపులో, నిర్బంధింపులో
పస లేని జీవితాన్ని
పేలవంగా నెట్టుకొస్తున్నా
ఆ బాధల వేదనల నుంచి
బయట పడాలనే
స్పృహ లేని జడాన్ని !
ఇరుకు బంధాల చెరలో
విడుదల లేని ఖైదీగా
చేయని తప్పుకు
ఆజన్మాంత శిక్ష విధించి
నిర్లజ్జగా సంచరిస్తున్న
నిట్టనిలువు స్వార్థాల
నిజ స్వరూపాన్ని పసికట్టలేని
అసమర్ధత నాది!
నిండు పాలకుండ లాంటి
హృదయంలో
నిరతం గరళాన్ని చిలుకరిస్తున్నా ఇసుమంతైనా పసికట్టలేని
అజ్ఞానం నాది!
అన్ని పాశాలూ యమపాశాలై తరుముతూ
ఆటవికంగా వేటాడుతూ
పాశవికంగా
అవకాశవాద రంగులను పులుముకొని పట్టపగలే
చుక్కలను చూపిస్తున్నా
పసిగట్టలేని అమాయకత్వం నాది!
అన్నీ అవగతమై,
సంకుచిత నైజాల తెరలు తొలగి
నిజాలు నిగ్గు తేలి
సర్వము తేటతెల్లమైన
ఈ సమయంలో
ఆఖరి ఘడియ తాలూకు
చివరి అంచున
అతి చేరువలో నిలబడి ఉన్న
ఆడజన్మ నాది!
- మామిడాల శైలజ