ఓ సాధకుడికి ఆధ్యాత్మిక సాధనని ఎలాచేయాలో ఓ గురువు నేర్పాడు. ఆయనసాధకుడికి ఓ విత్తనం ఇచ్చి చెప్పాడు.
"నీకు సాధనలో అనుమానాలు వస్తుంటాయి. ఈ విత్తనం నీకు ఇస్తున్నాను. దీన్నిపాతి నిత్యం నీళ్ళు పోస్తూ పెంచే ప్రయత్నం చేయి. నీ అనుమానాలని తొలగించడానికి నీకు అది సహాయం చేయగలదు".
ఆ సాధకుడు గురువు ఆజ్ఞ ప్రకారం ఆ విత్తనాన్ని ఓచోట భూమిలో పాతి నిత్యం నీరుపోసి సాధన చేసుకోసాగాడు.
ఏడాది గడిచింది. రెండేళ్లు గడిచింది. ఎంత సాధన చేస్తున్నా అతనికి తనలో ఎలాంటి ఎదుగుదలా కనిపించడంలేదు. మూడో ఏడుకూడా గడిచింది. తను మొదటి రోజు సాధనకి కూర్చున్నప్పుడు ఎలా వుందో ఆ రోజు కూడా అతనికి అలాగే అనిపించింది.
తనసాధనవల్ల తనలో ఆధ్యాత్మిక ప్రగతి కలగడంలేదనే అభిప్రాయం అతనిలో స్థిరపడిపోయింది. గురువుగారు సరైన మంత్రమే ఇచ్చారా ? తను సాధన ప్రక్రియని సరిగ్గాచేస్తున్నాడా? లేదా? ఇలాంటి అనేక అనుమానాలు అతనిలో పేరుకోసాగాయి. సాధనని వదల్లేదు. కానీ ఓ విధమైన అసంతృప్తి అతనిలో ఆలుముకో సాగింది.
నాలుగేళ్లు నిండాయి. ఐనా ఎలాంటి ప్రగతీ తనలో ఉందని తోచలేదు.సాధనా మార్గంలో ఐదో ఏడులోకి ప్రవేశించాడు .
ఇంతకాలం అతను గురువు ఇచ్చిన విత్తనం నాటిన చోట ఎలాంటి మొక్క రాకపోయినా రోజూ నీటిని పోయడం మాత్రం విస్మరించలేదు.
ఐదో ఏడు కొన్ని నెలలు గడిచాక అకస్మాత్తుగా ఓరోజు ఆ సాధకుడికి తను విత్తనం నాటిన చోట చిన్న మొలక కనిపించింది.
ఐదువారాల్లో ఆ సాధకుడు ఆశ్చర్యపోయేలాఅతని కళ్ల ముందే ఆ మొక్క తొంభై ఆడుగుల ఎత్తుకు ఎదిగింది!
సాధకుడిగా తన గురువు ఆ వెదురు గింజని పాతమని తనకి ఎందుకు ఇచ్చాడోఅర్ధమైంది. ఆ విత్తనం ఫలించడానికిఎక్కువ కాలం పట్టింది.
ఈలోగా ఆ విత్తనం సరిపడా బలంపుంజుకుంటోంది తప్ప ఖాళీగా లేదు. అలాగే తను చేసే సాధన వల్ల కూడా తను బయటకి కనపడని తనకి తెలీని బలాన్ని సాధన ద్వారాపుంజుకుంటున్నానని ఏదో ఓరోజు ఆ వెదురు అకస్మాత్తుగా ఎదిగినట్టు తను కూడా ఆధ్యాత్మికంగా పరిపక్వతని పొందు తాను అనే ఆలోచన ,అందులోంచి అతనికి ధైర్యం కలిగాయి. ఇంక ఎలాంటి ఆనుమానాలు పెట్టుకోకుండా అతను తన సాధన ని కొనసాగించాడు.
- మల్లాది వెంకటకృష్ణ మూర్తి