ఆకాశం నుండి కురిసింది
వాన కాదు అమృత సోన
దాహ తీవ్రత గొంతు గర్భంలో
పురిటి నొప్పులు పడుతున్నప్పుడు
ఊరటనిచ్చే వర్షం
పురుడు పోసిన మంత్రసాని హస్తం.
ఒక్కోసారి వర్షం చల్లని సంజీవని
ఒక్కోసారి గుండెల్లో దడ పుట్టించే
బీభత్సం
ఒక్కోసారి వర్షం ఒక్క బొట్టు రాల్చక
నా జనం కళ్ళని నింపిన
కన్నీటి సంద్రం.
ఒక్కోతూరి వాన పచ్చని పొలాలు
ధ్వంసించే కార్చిచ్చు
ఒక్కోతూరి వాన సమతుల్యతతో
రైతుకి పోసిన పంచప్రాణాలు
ఒక్కోతూరి కురవాల్సిన
పల్లెల్ని ఎండగట్టి
అవసరం లేని నగరాల్ని
ముంచేసే దౌర్భాగ్యం
ప్రకృతి లోకాలకి అన్నం పెట్టే అమ్మ
ఆ ప్రకృతినే భక్షించ చూస్తే
లేదు మానవాళికి మరో జన్మ.
-మాధవీసనారా (అనకాపల్లి)
Advertisement