పల్లెపడుచు (కథానిక)

Advertisement
Update:2023-12-09 10:13 IST

"రారా ప్రకాష్" అని తన పెళ్ళికి వచ్చిన స్నేహితుడిని అహ్వానిస్తూ ,ప్రతాప్ అక్కడే ఉన్న బాబాయితో - "బాబాయి,  వీడు ప్రకాష్.  కాలేజీలో చదువుకున్నప్పుడు మేమిద్దరం స్నేహితులం. ఇప్పుడు డాక్టర్ గా పట్నంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. కృత్రిమమైన వేషభూషలతో ఉండే పట్నం పిల్లలు వద్దని తనకు నచ్చిన పల్లెపడుచు కోసం వెదుకుతూ ఇంకా పెళ్లి కాకుండా ఉన్నాడు"

"మీరిద్దరూ మాట్లాడుకుంటూండండి, నేనోసారి లోపలికి వెళ్లి అన్నీ ఉన్నాయో లేవో కనుక్కొని వస్తాను"  అని

అరగంట తరువాత వచ్చి --

"పెళ్లిపీట రాలేదట. ఇంట్లో అటక మీద నించి దింపి తేవాలి. నేను వెళ్లి తెస్తాను" అన్న బాబాయితో --

"నువ్వెళ్ళడం ఎందుకు బాబాయి, మరెవరినేనా పంపిస్తానుండు" అన్నాడు ప్రతాప్.

"నేను వెళ్ళీదా అంకుల్" అని అడిగిన ప్రకాష్ తో --

"నువ్విప్పుడే వచ్చేవు కదా అబ్బాయి, ఇంకెవరినేనా పంపుతాను. ఎవరూ లేకపోతే నేను వెళతానులే"

"అయ్యో పెద్దవారు మీకెందుకు కష్టం. అయినా, ఇప్పుడు నేను ఇక్కడ ఖాళీగా కూర్చోవడం బదులు మీకు సహాయం చేస్తే  తృప్తిగా ఉంటుంది. నేనెక్కడికి వెళ్ళాలో ఏమిటి చేయాలో వివరంగా చెప్పండి చాలు"

"సరే. ఇల్లు తాళం వేసుంది కాబట్టి నీతో మా అమ్మాయిని పంపిస్తాను. ఇద్దరూ వెళ్లి తెద్దురు గాని"

"అలాగైతే, నా కారులో వెళ్లి పెళ్లిపీట డిక్కీలో వేసి సులువుగా తెచ్చేస్తాం"

"ప్రతాప్, అమ్మాయిని ఇంటి తాళం పట్టుకొని రమ్మను" అని బాబాయి చెప్పగానే - ప్రతాప్ లోపలికి వెళ్లి వసంతతో కలిసి వచ్చేడు.

"అమ్మా వసంతా - ఈ అబ్బాయి డాక్టర్ ప్రకాష్, మన ప్రతాప్ స్నేహితుడు" అని -

"అబ్బాయి - ఈమె నా ఏకైక సంతానం వసంత" అని -- ఇద్దరికీ పరిచయం చేసేడు.

తనకి నమస్కారం చేసిన వసంతకి ప్రతినమస్కారం చేసేడు ప్రకాష్.

పెద్దాయన వసంతతో –

"ఈ అబ్బాయితో నువ్వు మన ఇంటికి వెళ్లు. కొట్టుగదిలో అటక మీద ఉన్న పెళ్లిపీట జాగ్రత్తగా క్రిందకి దింపి తీసుకొనిరండి. ఇప్పుడు ఇక్కడ చేయవలసిన పనులేమీ లేవు కాబట్టి,  అక్కడినుంచే మన తోటకి వెళ్లి అబ్బాయి ప్రకాష్ కి మన తోటంతా తాపీగా చూపించు. తోటలో ఉన్నరంగడిని సాయంత్రం రమ్మని గుర్తు చేయి. వాడు కనిపించకపోతే వెతకొద్దు, వచ్చేయండి. చెప్పడం మరిచేను, అటక ఎక్కినప్పుడు దిగినప్పుడు పెళ్లిపీట దింపుతున్నప్పుడు దెబ్బలు తగలకుండా చూసుకోండి ఇద్దరూ, జాగ్రత్త."  

"మీ అమ్మాయికి ఏ దెబ్బా తగలకుండా జాగ్రత్తగా మీకు అప్పచెప్తాను. మీకేమీ భయం అక్కరలేదు అంకుల్"

"నీ చేతుల్లో పెడుతున్న మా అమ్మాయి గురించి నాకు భయం ఎందుకు బాబూ” అన్నారు పెద్దాయన - గుంభనంగా.

"సరే నాన్నా" అని, ప్రకాష్ తో కలిసి బయలుదేరిన వసంత వంక చూసిన ప్రతాప్ –

 "బాబాయ్ !వీళ్ళిద్దరినీ ఇలా తిరగనిస్తే అసలే మనది పల్లెటూరు, జనం అవాకులు చెవాకులు వాగుతారేమో"

"వాగనీ. వసంత మీద నాకు నమ్మకం ఉంది. నీ స్నేహితుడు ప్రకాష్ మీద నీకు ఏమేనా అనుమానం ఉంటే చెప్పు, వాళ్ళని వెనక్కి పిలిపిస్తాను లేదా వాళ్ళ వెనకాతల ఎవరినేనా పంపిస్తాను.” 

"మన వసంత వజ్రం. ఇక ప్రకాష్ అంటావా శుద్ధమైన బంగారం. ప్రకాష్ ఎప్పుడూ తప్పు చేయడు, మరొకరిని తప్పు చేయనివ్వడు. వాడి మీద నాకు అంత నమ్మకం."

"మరింకేం. "బంగారానికి వజ్రం తాపడం పెడితే ఎలా ఉంటుందంటావు"

"దివ్యంగా ఉంది బాబాయి నీ ఆలోచన"

“వాళ్ళు వచ్చిన తరువాత వీలు చూసుకొని అబ్బాయితో ఈరోజే మాట్లాడి వసంత పట్ల అతని అభిప్రాయం కనుక్కొని నాకు చెప్పు. నేను కూడా అమ్మాయితో మాట్లాడి దాని అభిప్రాయం తెలుసుకుంటాను"

"అలాగే బాబాయి. వాళ్లిద్దరూ సరే అంటే, ప్రకాష్ అమ్మా నాన్నా ఎలాగూ రేపు వస్తారు కాబట్టి, సంబంధం ఖరారు చేసేసుకొని, వాళ్ళ పెళ్ళికి ముహూర్తం త్వరలో పెట్టించేద్దాం"

వసంత ప్రకాష్ ఒకరికొకరు పరిచయమైన ఆ కొద్ది సమయంలోనే --

తలంటుకుని ఒత్తుగా పొడుగ్గా ఉన్న నల్లని జుత్తుతో, అందంగా ఉన్న పెద్ద కళ్ళతో, మాట్లాడితే చిన్నగా సొట్టపడుతున్న బుగ్గలతో, దొండపండుని పోలిన పెదాలతో, సన్నపాటి బంగారు గొలుసున్న శంఖం పోలిన మెడతో, నాజూకుగా ఉన్న వేళ్ళతో, పసుపు రాసుకున్న కాళ్ళకి చిరు సవ్వడి చేస్తూన్న మువ్వల పట్టీలతో, గుబాళిస్తున్న మల్లెపూలు తురుముకున్న పొడుగాటి వాలుజటతో, జటకి ఉన్న జడగంటలతో, ఘనమైన వక్షసంపదతో, ఆ బరువుకి సన్నబడిందా అన్నట్టుగా చేతిలో ఇమిడిపోతుందనిపించే సన్నని నడుముతో, పచ్చని పావడా అదే రంగు జాకెట్టు మీద నీలిరంగు ఓణీతో -- అందానికి నిర్వచనంగా కనిపిస్తున్న పల్లె పడుచు అయిన వసంత  -- ప్రకాష్ మనసుని ఆకట్టుకుంది.      

చక్కటి మీసకట్టుతో, ఎగుభుజములతో, విశాలమైన వక్షంతో, చక్కని ఆకృతితో, పొడుగ్గా ఉండి, చెదరని చిరునవ్వుతో అందంగా ఉన్న ప్రకాష్  -- వసంత మనసంతా నిండిపోయేడు.

పది నిమిషాలలో ఇంటికి చేరుకున్న వారిద్దరూ కారు దిగగానే –

"రండి" అంటూ వసంత ప్రకాష్ ని ఇంటి లోపలికి పిలిచింది.

"కోయిలలాంటి గొంతుక ఉన్న మీరు, కారులో ఒక్క మాట కూడా మాట్లాడలేదేమండీ"

"వాగుడుకాయ అనుకుంటారేమో అని భయం.  అయినా మీరు కూడా ఏమీ మాట్లాడకుండానే ఉన్నారు కదా. మా ఇంటికి మొదటి సారి వచ్చేరు, ఇలా సోఫాలో కూర్చోండి, కాఫీ త్రాగుదురు గాని"

"మీతో బాటూ వంటగదిలోకి నేను రా కూడదా”

‘ఎందుకు’ అన్నట్టుగా చూస్తున్న వసంతతో --

"మీరు కాఫీ చేస్తూంటే పొయ్యి వెలుతురులో ద్విగుణీకృతమయే మీ అందం చూడాలని”

ఆమె చిరునవ్వే అంగీకారంగా తలచిన ప్రకాష్ వసంత వెంట వంటింట్లోకి నడిచేడు.  

వసంత కాఫీ కలుపుతున్నదే కానీ, తన మీదనే నిలిచిన ప్రకాష్ చూపులు నిశ్శబ్దంగా కొత్తగా పులకరింతలతో

పలకరిస్తూంటే, అతని మీద అప్పటికే ఉద్భవించిన ప్రేమతో ఆ అనుభూతిని మనసు నిండుగా ఆస్వాదిస్తోంది.

గ్యాస్ పొయ్యి మంట వెలుతురు వసంత మొఖం మీద పడి, ఆమె మొఖం చిరు చెమట పడుతూంటే, ఆమెనే కళ్ళార్పకుండా చూస్తూ ఆమెలోని కొత్త అందాన్ని తన కన్నులలో నింపుకున్న ప్రకాష్, ఆమె మీద ప్రేమతో ఊహా లోకంలో విహరించసాగేడు.

"నన్ను చూసింది చాలు. ఇగో కాఫీ తీసుకోండి" అన్న వసంత పిలుపుతో, ఇహలోకంలోకి  వచ్చిన ప్రకాష్ –

కాఫీ తీసుకొని సిప్ చేసి - "మీ అంత బాగుంది మీరు చేసిన కాఫీ"

“మీరు అందంగా ఉండడమే కాక, చాలా అందంగా మాట్లాడుతున్నారు కూడా"

"నేనెంత అందంగా ఉన్నా, మీ అంతగా కాదు లెండి"

"ఈ పల్లె పడుచుని పొగిడింది చాలుగానీ, రండి మనం వచ్చిన పని చూద్దాం." అంది వసంత చిరునవ్వుతో.

అటక మీద నుంచి తీసిన పెళ్లిపీటని -- నిచ్చెన ఎక్కి ఉన్న ప్రకాష్ ఒక చేత్తో, క్రిందనే ఉన్న వసంత ఒక చేత్తో పట్టుకుంటే - జాగ్రత్తగా దింపుతూ ప్రకాష్ నిచ్చెన దిగేడు.

"మీరు సులువుగా పైకి ఎక్కి జాగ్రత్తగా దింపగలిగేరు. కంగ్రాట్స్" అంది వసంత నవ్వుతూ.

"థాంక్స్. క్రిందన ఉండి మీరు సహకరించేరు కాబట్టే" అన్నాడు ప్రకాష్ కూడా నవ్వుతూ.

ఆమాటల వెనకున్న చిలిపి అర్ధం స్ఫురణకు వచ్చి యుక్తవయసులో ఉన్న వారిద్దరు ఒకరు కళ్ళలోకి ఒకరు చూసుకుందుకి సిగ్గుపడి తలలు వంచుకున్నారు

పెళ్లిపీటని కారు డిక్కీలో పెట్టి బయలుదేరిన వారు త్వరలో తోటకి చేరుకున్నారు.

సుమారుగా తోటంతా చూసి వచ్చిన వారు అలసటతో ఒక చోట ఆగితే -

"మీరు ఇక్కడే ఉండండి, నేను రంగడు ఇంటికి వెళ్లి సాయంత్రం రమ్మని చెప్పి వస్తాను" అని వసంత వెళ్ళింది.

చేతికి అందినట్టుగా ఉన్న రకరకాల పళ్ళ చెట్లని చూసుకుంటూ పల్లెటూరి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ అక్కడే నిలబడిన ప్రకాష్, వేగంగా వచ్చిన వసంత గట్టిగా తగలడంతో –

తూలి పక్కనున్న పెద్ద గడ్డికుప్ప మీద వెల్లకిలా పడిపోయి - తన మీద ఉన్న ఆమెని చూస్తూ, తన గుండెమీద అదిమి ఉన్న ఆమె పరువాల ఒత్తిడిని అనుభవిస్తూ -- చేష్టలుడిగి నిశ్శబ్దంగా ఉండిపోయేడు.   

అలా ఒకరి మీద ఒకరు ఉండేసరికి -- అప్పటికే ఒకరి మీద ఒకరికి కలిగిన ఆకర్షణతో నిండి ఉన్న ప్రేమతో -- అసంకల్పితచర్యగా వారి నాలుగు పెదాలు ఒకటైపోయి తొలిసారిగా లభించిన అధరామృతం ఇద్దరూ ఆత్రంగా జుర్రుకోసాగేరు.

రెండు నిమిషాల తరువాత జరిగింది తెలుసుకున్న వసంత రివ్వున లేచింది. కానీ, ప్రకాష్ కాళ్ళ క్రింద ఆమె పావడ అంచులు ఉండిపోవడంతో, తూలి మరలా ప్రకాష్ మీద పడిపోయింది.

అనుకోకుండా రెండవసారి లభించిన ఆనందానుభూతిని అనుభవిస్తున్నట్టున్న ప్రకాష్ ని చిరునవ్వుతో చూస్తూ వసంత వంగోని అతని కాళ్ల క్రింద ఉండిపోయిన పావడ అంచుని జాగ్రత్తగా తీసుకొని తనని తాను నిలబెట్టుకుంది.

 

వంగోని లేవడంతో - ఎద మీద ఉన్న ఓణీ క్రిందకి జారి ప్రకాష్ కాళ్ళ మీద జీరాడుతూ ఎగశ్వాసతో ఉబుకుతున్న ఆచ్ఛాదన లేని వసంత ఎద అందాలు జాకెట్టు మీదుగా బహిర్గతం కాసాగేయి.  

అది గమనించిన వసంత వంగొని ప్రకాష్ కాళ్ల  మీద జీరాడుతున్న తన ఓణీని తాపీగా తీసి జాకెట్టు మీంచి విసురుగా వేసుకుంది.  అలా వంగోవడంలో - ఆచ్ఛాదన లేని జాకెట్ కొంచెం లోతుగా ముందుకు వచ్చి, వసంత ఎద సౌందర్యం ప్రకాష్ కళ్ళతో దోబూచులాడింది.

ప్రకాష్ చూపులు తన ఎదని తాకుతూంటే సిగ్గుపడుతూ అటు తిరిగి నిలబడిన వసంత భుజం పట్టుకొని "నామీద కోపంగా ఉందా" అని ప్రకాష్ మెత్తగా అడిగితే, ఇటు తిరగకుండానే "లేదు" అన్నట్టు తలూపి జవాబిచ్చింది.

ఆమె జడలోని మల్లెల సుగంధం ఆఘ్రాణిస్తూ, ఆమెను ఇటు తిప్పుకుందికి ప్రయత్నించి, ఆమె చెవిలో  "నేనంటే ఇష్టమేనా" అని నవ్వుతూ ప్రకాష్ గుసగుసలాడగానే - ఒక్కసారిగా ఇటు తిరిగి, అతని గుండెలో ఆనందంగా దాగిపోయింది వసంత.

ఆమెని గట్టిగా తన కౌగిట్లో పొదివి పట్టుకున్న ప్రకాష్ - వసంత చుబుకం ఎత్తి - ఆమె కళ్ళలోకి ప్రేమతో చూస్తూ  "మనం తిరిగి వెళ్ళగానే, ఈ పల్లె పడుచుని నాకిచ్చి పెళ్లి చేయమని మీ నాన్నగారిని అడగనా" అని అడగగానే - "తప్పకుండా" అని జవాబిచ్చి సిగ్గుతో మరింతగా ప్రకాష్ గుండెలో ఒదిగిపోయి అతనిని గట్టిగా కౌగలించుకుంది వసంత.  

ఆ మధురమైన పరిష్వoగం మరికొన్ని నిమిషాలు అనుభవించిన ఇద్దరూ, ‘ఇంత కంటే ముందుకు వెళ్ళకూడదు’ అన్న సంస్కారం ఉన్నవారు కావడంతో వెనక్కి బయలుదేరేరు.  

 

"వసంతా, నువ్వు రంగడి దగ్గరకి వెళ్లి వస్తున్నప్పుడు అంతగా రొప్పుతూ పరిగెత్తుకుని ఎందుకు వచ్చినట్టు"

"దయచేసి ఆ విషయం గురించి నన్ను అడగకండి, ఇప్పుడు ఎవరికీ ఏమీ చెప్పలేను"

"నాతో కూడా చెప్పకూడదా"

"మీ ఒక్కరితోనే చెప్పగలను, చెప్తాను.  కానీ ఇప్పుడు కాదు,  మన ఇద్దరం ఒక్కటైన తరువాత చెప్తాను”

ప్రతాప్ పెళ్ళైన నెల రోజులకు ప్రకాష్ వసంతలకు కూడా పెళ్లి జరిగిపోయింది.

 

వారి శోభనం రాత్రి ఆతృతగా కలసిన మేనుల కలయికలో అలసట తగ్గి కాస్త విశ్రాంతి తీసుకున్న తరువాత --  

"వసంతా, ఆరోజు నువ్వు రంగడి ఇంటికి వెళ్లి వస్తున్నప్పుడు అంతగా రొప్పుతూ పరిగెత్తుకుని ఎందుకు వచ్చినట్ఠో ఇప్పుడేనా చెప్తావా" అని అడిగిన ప్రకాష్ ప్రశ్నకు అతని చెవిలో మెల్లిగా ...

"కొన్ని నిమిషాల ముందర మనం అనుభవించిన తమకంతో -ఆ రోజు రంగడు దంపతులు అనుభవించడం నా కళ్ళ పడింది"  అని జవాబిచ్చి సిగ్గుతో తన గుండెలో మొఖం దాచుకున్న వసంతని మరింతగా దగ్గరకు తీసుకొన్నాడు, ప్రకాష్.

మద్దూరి నరసింహమూ ర్తి

(బెంగళూరు)

Tags:    
Advertisement

Similar News