అక్టోబర్ 2 అంటే మహాత్మ గాంధీ గారి పుట్టినరోజుగా మాత్రమే అందరూ గుర్తు పెట్టుకుంటారు. కానీ అదే రోజు భరతమాత కన్న మరో మహా నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజు. ఏది ఏమైనా, మనం మరుపురాని రోజుగా గాంధీ జయంతిని పండుగగా జరుపుకునే అక్టోబర్ 2న మన దేశానికి మూడవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం కూడా. నెహ్రూ మరణం తర్వాత గుల్జారీలాల్ నందా తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి భారత మూడో ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టారు.దేశం కోసం ప్రాణాలు విడిచిన లాల్ బహదూర్ శాస్త్రి 1904 అక్టోబర్ 2 ఉత్తర ప్రదేశ్‌లోని మొగల్ సరాయ్ గ్రామంలో శారదా ప్రసాద్ రాయ్, రామ్ దులారీ దేవీలకు జన్మించారు.
కాకిలా కలకాలం జీవించే కంటే హంసలా కొద్ది కాలం జీవించారు శాస్త్రిగారు. ప్రధానిగా కొంతకాలమే ఉన్న భారతీయ యవనికపై లాల్ బహుదూర్ శాస్త్రి తనదైన ముద్ర వేశారు. అదే ఆయన్ని ధృడమైన నాయకునిగా మన ముందు నిలబెట్టాయి. 1965 భారత్-పాకిస్థాన్ యుద్ధం సందర్భంగా ఆయన ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు, సంకల్పం, దీక్షా దక్షతలను ఎంత చెప్పుకున్నా తక్కువే.
ముఖ్యంగా దేశానికి వెన్నుముకలైన రైతులను, సైనికులను ఉద్దేశించి ఆయన చేసిన నినాదం ‘జై జవాన్..జై కిసాన్’ దేశాన్ని ఒక్కటి చేసింది. పాకిస్థాన్‌పై విజయాన్ని సాధించిన ఆనందాన్ని దేశ ప్రజలతో పంచుకునే లోపే 1966 జనవరి 10న పాకిస్థాన్‌తో తాష్కెంట్(ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్)లో ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంతో యుద్ధ విరమణ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆ మర్నాడే జనవరి 11న ఆయన గుండెపోటుతో కన్నుమూసారు.
ఓ దేశాధినేత అదీ మరో దేశానికి అతిథిగా ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు వెళ్లి అక్కడే అసహజ, అనుమానాస్పద రీతిలో మృతి చెందటం చరిత్రలో అంతకు ముందెన్నడు లేదు. ఆ తర్వాత ఎప్పుడూ లేదు. ఐనా ఇంత వరకు శాస్త్రి మరణంపై పూర్తి స్థాయి సమగ్ర దర్యాప్తు జరగలేదు. జరిగినా వాటి ఫలితాలు వెల్లడికాలేదు. ఆఖరకు వాటికి సంబంధించిన పత్రాలు ఇప్పుడు అందుబాటులో లేవు.
మొత్తానికి భారతదేశ రాజకీయాల్లో ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా నీతి, నిజాయితీ, నిరాడంబరత, వ్యక్తిత్వం, త్యాగశీలతే శాస్త్రీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ఆయన చనిపోయిన తర్వాత భారత ప్రభుత్వం ఆయన్ని భారతరత్నతో గౌరవించాయి. చనిపోయిన తర్వాత ఈ బిరుదు అందుకున్న తొట్ట తొలి నాయకుడిగా లాల్ బహదూర్ శాస్త్రి చరిత్రలో నిలిచిపోయారు. మొత్తానికి భారతదేశ యవనికపై లాల్ బహుదూర్ శాస్త్రిది ప్రత్యేక సంతకం అనే చెప్పాలి.
మహనీయ వర్తనం
( లాల్ బహదూర్ శాస్త్రి జీవితం నుంచి )
దేశ ప్రధాని కాకముందు లాల్ బహాదుర్ శాస్త్రి గారు ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ మునిసిపల్ ఎన్నికలలో గెలిచాడు. దానితో సహజంగా ‘‘అలహాబాద్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్టు’’కు కూడా ట్రస్టీ అయ్యాడు. అపుడు అక్కడ ‘టాగూర్‌నగర్’ అనే పేరుతో 1/2 ఎకరా భూమిని ప్లాట్లుగా విభజించి వేలానికి పెట్టారు. శాస్త్రి వూళ్ళో లేని సమయంలో, ఆయన అంతరంగిక మిత్రుడొకాయన కమీషనర్‌ను కలిసి ‘శాస్త్రి’ గారికి సొంత ఇల్లులేదు. కాబట్టి ట్రస్టు సభ్యులందరూ ఒక్కో ప్లాటు దక్కించుకొనేలాగా ఒప్పించి, తనకు, శాస్త్రికి ఒక్కో ప్లాటు సంపాదించగలిగాడు. ఆ విషయాన్ని శాస్త్రి గారి భార్య లలితాశాస్త్రి తో చెపితే ‘‘పోనీలెండి, అన్నయ్యగారూ, మీ ప్రయత్నం కారణంగా ఇన్నేళ్ళకు "స్వంత ఇల్లు" అనే మా కల నెరవేరబోతుంది అని సంతోషించారట. రెండురోజుల తరువాత అలహాబాద్ తిరిగొచ్చిన శాస్త్రి గారికి ఈ విషయం తెలిసింది. ఆయన చాలా బాధపడ్డాడు. తన ఆంతరంగిక మిత్రుడిని పిలిచి ‘‘నాకు ఈ విషయం తెలిసినప్పటినుండి రాత్రిళ్ళు నిద్రపట్టడం లేదు. మనం ప్రజాప్రతినిధులం. ప్రజలముందు నిజాయితీగా నిలవాల్సిన వాళ్ళం. నేను నా ప్లాటును వాపసు ఇచ్చేస్తున్నాను. మీరుకూడా వాపసు ఇచ్చేయండి. లేదా రాజీనామాచేసి, సాధారణ పౌరుడిగా వేలంపాటలో పాల్గొని, కావాల్సి వుంటే ప్లాటును దక్కించుకోండి,’’ అని చెప్పి ప్లాటును ట్రస్టుకే వాపసు ఇచ్చేసారట. జీవితాంతం స్వంత ఇల్లులేకుండానే జీవించారు.
• లాల్ బహదూర్‌శాస్త్రి దేశ ప్రధానమంత్రి అయిన తరువాత కూడా ఆయన కొడుకులు సిటీ బస్సుల్లోనే ప్రయాణించేవారు. కొందరు స్నేహితులు ఈ విషయంగా కొంచెం గేలిచేయడంతో, కారు కొనమని వాళ్ళు తండ్రి (శాస్త్రిగారు) మీద ఒత్తిడిచేస్తే ఇష్టంలేకపోయినా, ఆయన అక్కడక్కడ అప్పులుచేసి ఒక ఫియట్‌కారు కొన్నాడు. కారు కొనేందుకు చేసిన అప్పు ఇంకా 4600 రూపాయలుండగా శాస్త్రి మరణించాడు. ఈ విషయం దినపత్రికల్లో వచ్చిందట. దేశవ్యాప్తంగా శాస్త్రి అభిమానులు, ఆయన భార్య లలితాశాస్త్రి కి మనీఆర్డర్ చేశారట. రెండు సంవత్సరాలపాటు ఆమె మనిఆర్డర్‌లు అందుకొన్నారట. కానీ ఆమె, డబ్బు పంపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలతో ఉత్తరం వ్రాస్తూ, డబ్బును కూడా వాపసు పంపించేసారట.
• లాల్‌బహదూర్‌శాస్త్రి ప్రధానిగా ఉన్న సమయంలో వారి పెద్దకొడుకు హరికృష్ణ శాస్త్రి అశోక్ లేలాండ్ సంస్థలో ఉద్యోగం చేస్తుండేవాడు. ఆ సంస్థవారు హరికృష్ణశాస్త్రికి సీనియర్ జనరల్ మేనేజర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. సంతోషించిన హరికృష్ణశాస్త్రి మరుసటిరోజు, లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఈ విషయం తెలిపాడు. ఒక నిమిషం ఆలోచించి, ‘‘హరీ, ఆ సంస్థ, ఆకస్మాత్తుగా నీకెందుకు ప్రమోషన్ ఇచ్చిందో నేనూహించగలను. కొన్నిరోజుల తరువాత, ఆ కంపెనీవాళ్ళు ఏదో ఒక సహాయంచేయండని నాదగ్గరకు వస్తారు. నేను వారికాసహాయం చేస్తే దేశ ప్రజలు దాన్నెలా అర్ధంచేసుకుంటారో నాకు తెలుసు, నీకూ తెలుసు. పాలకుల నిజాయితీని ప్రజలు శంకించేలాగా జీవించడానికి నేను వ్యతిరేకం. కాబట్టి నీవు వెంటనే ఆ సంస్థలో నీ ఉద్యోగానికి రాజీనామా చేయి. నేను ప్రధానిగా వున్నంతకాలమూ నీవు ఆ సంస్థలో ఉద్యోగం చేయడానికి లేదు’’ అన్నారట.