జటా జూటముల
గంగాజలము
కేశ పాశ మధ్యమున
అర్ధచంద్రము
మూడు భస్మరేఖల
ఫాలభాగము
భృకుటి మధ్యమున
అగ్నినేత్రము
అర్థ నిమీల నేత్ర
జగద్వీక్షణము
కంఠము నందున
హాలా హలము
కంఠము చుట్టిన
కాలసర్పము
కంఠము నింపే
రుద్రాక్ష ధారణము
దక్షిణ హస్తమున
త్రిశూలము
వామ హస్తమున
జ్ఞాన కపాలము
కటి భాగమున కప్పిన
గజచర్మము
పులిచర్మముపై వేసె
పద్మాసనము
ఒడలంత పూసిన
భస్మలేపనము
వామ భాగమున
శక్తి రూపము
ఢమరుక ధ్వనుల
అక్షరజ్ఞానము
నిశ్చలముగ నిల్పిన
తపోధ్యానము
ధర్మ వృషభము
నీదు వాహనము
ప్రకృతిన నిండిన
ప్రణవ నాదము
దశ దిక్కుల వ్యాపించిన
తత్వము
దర్శించగ జగతికి
లింగరూపము
కనులకు ఇంపగు
దివ్యరూపము
ఓం బీజాన ఒదిగిన
మహాకారము
పంచభూతముల కది
ఆధారము
పఠియింపగ
పంచాక్షరీ మంత్రము
భక్తి మీర కొలువగా
ముక్తిమార్గము
పరమ పథమునకది
సోపానము
నిర్మలమైన
దివ్య స్వరూపము
కానగ విచ్చేసె నిదె
కార్తీకమాసము
వెలిగించగ రారే
జ్ఞాన దీపములు
దీప్తి నొందెడి
జ్యోతిర్లింగములు
ఛేదించు నవి
అజ్ఞాన తిమిరాలు
ఇందు వాసరపు
ఉపవాస దీక్షలు
ఏకాగ్రతను నింపే
ఏకాదశ దీక్షలు
కర్మ మార్గములకు
దశానిర్దేశాలు
ఆధ్యాత్మికతకు
ఆరంభ సూత్రాలు
- కె. వి యస్.గౌరీపతి శాస్త్రి(వీరవతి)