ఏమిరా! మానవా!
పలుకవేమి బధిరమా!
కులం కులం అని
కుంటిసాకులు పోతివే!
మతం మతం అని
మనుష జాతిని విడదీస్తివే!
చల్లబడదా నీ కడుపు మంట
తలుచుకుంటే ఎంత ఘోరం!
తీర్చబడునా గుండెభారం!
కోవిడంటూ కొలిమి పెడితివి
మానవత్వం మాడ్చివేస్తివి
ఇంట ఇంటా నిప్పు పెడితివి
వరుస వరుసా పాడె కడితివి
అయినవారు ఒక్కరొక్కరు
తిరిగిచూస్తే ఏరి వారు?
చూరు క్రిందన పండుటాకు
పక్కనుండే పాత కర్ర
బోసి నవ్వుల బాలశిక్ష
మాకు నేర్పిన మనుచరిత్ర
ఏడబోయెను తాత తతులు?
పడక కుర్చీ బోసిపోతూ...
కొలువు చేసి కొరత తీర్చే
ఏడి నాన్నని అడగనా?
ముద్దుపెట్టి ముద్ద పెట్టిన
ఏది అమ్మని ఏడ్వనా?
నిన్న చూచిన పలకరింపులు
నేడు మౌనం వ్రతము పట్టిన
ఆ ఆప్తమిత్రులు ఏరిరా?
ఆప్యాయపు తిట్లింకేవిరా?
చాలుచాలిక కట్టిపెట్టు
మేలుచేయుటకొట్టుపెట్టు
మానవత్వం వ్యాప్తి చెందగ
కొత్త కొలిమిన ఊపిరూదు.
-క్రొవ్విడి వెంకట బలరామమూర్తి.
(హైదరాబాదు)