నదీ నిర్వేదముద్ర

Advertisement
Update:2023-10-18 18:05 IST

రోజూ నేనొక నదిమీద కన్నీరై ప్రవహిస్తుంటాను;

అది ఖాయిలా పడ్డ నది!

నీటిచుక్క జాడలేని శుద్ధ స్మశానవీధి!

ఆ బీద నదీ ఎద సొద వింటూ

రోజూ నేనొక నదిమీద బధిరగానమై సాగుతుంటాను..;

**

ఏళ్లుగా ప్రవహిస్తున్నాను

ప్రవహిస్తూ ప్రవహిస్తూ

ఆ దారికి బంధమైపోయాను

అక్కడొక నది

ఆ నది చుట్టూ ఏదో విస్మయం

నన్ను ఆదారికి దాసుణ్ణి చేసింది!

రోజూ వెళ్లే ఆదారిలో

అటువీచినా ఇటు మరలినా

సరిగ్గా అక్కడికి రాగానే

కిటికీలను తెరుచుకుంటుంది దేహాత్మ

మనసు మలినాన్ని కడుక్కున్నట్టు

ఒక ఐంద్రజాలమేదో తనువంతా పాకుతుంది

అది నదీమాయ అని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది

***

ఒక క్షయ రోగిలాంటి ఆ నదీ తనువంతా

పరచుకున్న కురుపుల్లాంటి తుమ్మలు బ్రహ్మాది జముళ్ళు..

ఆ దృశ్య సమాహారమంతా

హృదయఛిద్ర కండ్లకలక!!

**

ఎప్పుడో ఓసారి ఒళ్ళు మరిచి

ఒక వాన కురుస్తుంది

ఏళ్ల నాటి ముసలి చెరువొకటి

సడుగులిరిగి చేతులెత్తేసి వంకల్ని,వాగుల్ని చెరిపి

నది కడుపు నింపుతుంది

నది కల్లుతాగిన కోతిలా గెంతి దూకుతుంది

అప్పుడిక నది ఒడ్డంతా జలజలజాతర

నదీ జన జాతర..

నీళ్లను చూడడం

నా సీమ కన్నుల వేడుక

ఈనేలకొక అపురూప దృశ్యభంగురం

బండ్లు కట్టుకొని వెళ్లిచూసే నిషా ఇక్కడ

నీళ్లంటే!

జాతర ముగిసిన మూణ్ణాల్లకి

గుండెపగుళ్ళ తీరాల

నిశ్శబ్ద స్వరాలను వినే

నదిది యథా నిర్వేదముద్ర!

*

నా రాజకీయ శాపగ్రస్తనేల చెవిలో

వానమంత్రం జపించి..

నా ఈ నదికి నిత్య వసంతాల్ని

తెచ్చేనాయకుడొకడు

నా నేలదేహంమీద పుట్టుమచ్చై పుట్టుకురావాలని

బైరాగినై కాంక్షలు పాడుకుంటూ

రోజూ నేనానది మీద చకోరాన్నై ఎగురుతుంటాను..!

- కొత్తపల్లి సురేష్

Tags:    
Advertisement

Similar News