రెండు అందమైన మేలిముత్యాల్ని
కప్పిన కనురెప్పల ఆల్చిప్పల కింద
రంగుల కాంతి ప్రవాహమేదో
సుదూర కలలతీరంలోకి మోసుకుపోతోంది
తనువు దూదిపింజలా తేలిపోతూ
ఆ తీరంవైపు పరిగెడుతోంది
ఒక బహుదూరపు లక్ష్యంపై ముత్యాల వెలుగు
దృశ్యాదృశ్యంగా ఎవరెవరివో
స్వాగత గీతాలాపన
నిద్రాణమైన నా మనసు మేల్కొని
ముత్యాలు ప్రసరించిన కాంతివైపు నిమగ్నమైంది
పోల్చుకున్నాను
నేనెరిగిన కవిత్వోద్యమాల మహాకవులంతా
నిశ్శబ్దాల జాడలన్నింటినీ భగ్నం చేసి
ఆశాదూతలుగా శైశవగీతి
బృందగానం చేస్తున్నారు
కవిత్వానంత సాగర తీరంలో
ఇసుకగూళ్ళు కట్టుకుంటున్న పసిబాలురయ్యారు
కాంక్షించిన మరోప్రపంచం
కల్లలు కాలేదని సంబరపడుతున్నారు
కలలో నన్నుకొత్తగా ఆవిష్కరిస్తున్నారు
నాదీ వారితో కలిసిన స్వరమే
-కొంపెల్ల కామేశ్వరరావు
Advertisement