బ్రతుకున
ఏ కష్టం తొందర చేసిందో
ఎండకన్నెరుగని ఓ తల్లి
పూటమెతుకులకోసం
చెమటలుమిసింది
నీడ చాటుననీటి చెప్టాల్లో పనిమనిషి విధులకే పరిమితమైన ఆమె
ఆశల వాహనమెక్కాననుకుని భ్రమించి
తనను పోలిన తల్లులతో
నేలపై కాళ్ళు కలిపి
మైళ్ళు కొలిచింది
చెప్పుల్లేని అరిపాదాలతో
పరువు కాల్చిన నిప్పుల తోవలో
విరామమెరుగని సుదీర్ఘయాత్ర
నలుపెక్కిన చర్మాన్ని
వేలకళ్ళ చురకత్తులతో పొడిపించుకుంది
ఆకతాయి నాలుకలంటించిన
అశ్లీలాన్ని మెదడుకు వేలాడదీసుకుంది
ఈతిబాధల కడలినుంచి
తీరంచేర్చని నావలో
స్వాభిమానాన్ని
అంతరంగపు అట్టడుగు పొరల కొక్కేనికి తగిలించి
తనను మరచి
దేహాన్ని పణంగా మలచి
ఎజెండా ఎరుగకపోయినా
బాధే సత్యమనే భావన తరుముతూఉంటే
భుజాన పార్టీల భ్రమావరణాన్ని ఊరేగించింది
మోరెత్తి గాండ్రించిన పులిలా
జై కొట్టింది
కన్నబిడ్డ ఆకలికేకకు
పేగు కదిలినా
ఆశల్నీ, హామీల గాలిమూటల్నీ
అపనిందల చేదునీ
ఆరోపణల విషాన్నీ
గొంతులోనే మండించుకుంది
చేబదుళ్ళ క్రీనీడలు
గడించిన కొద్దిపాటి రూకలకు
పద్దులు రాస్తుంటే
మర్నాడు మళ్ళీ అదే ప్రయాణం
ఆశలగాలంలో
మళ్ళీ చిక్కుకోవడం
(ఆర్థికావసరాలకోసం రాజకీయపార్టీల జెండాలు మోసిన ఓ మహిళను చూశాక)
- కొంపెల్ల కామేశ్వరరావు