కోపంలో
ఆ నయనాలు ఎరుపెక్కిన
మందారాలవుతాయి
అలకలో
ఆ చూపులు అరక్షణంలో
ఆరిపోయే
ఎండుటాకు మంటలవుతాయి
ఆ క్షణమే-
ఆప్యాయత అరిటాకులో మృష్టాన్న
భోజనమవుతుంది
శృతి చేస్తోన్న పాటలో
మూతి విరుపులతో
ఆరంభమైన పల్లవి.....
ఎత్తి పొడుపులు చరణాలవుతాయి
ముద్దబంతుల్లాంటి
పెదాలు
పెద్ద పెద్ద మాటల ఈటెలు విసురుతాయి
అంతలోనే
అంతరంగంలో ఆవేదన
ఇరు మనసుల ఆత్మ పరిశీలన
భారమైన నిట్టూర్పు
ఒకరికి ఒకరై ఓదార్పు
జేగురించిన మందారాలు
చల్లని హిమపాతాలవుతాయి
ఎదను కోసిన పెదాలు
వాడిపోని పారిజాతాలవుతాయి.....
ఆమె పెదవి కదిపితే
మకరందం స్రవించినట్లు
స్నిగ్ధత విరబూస్తే
స్వర్గం ఎదుట నిలిచినట్లు
కొలతలు లేని ఆనందపు గట్లు
తెగిపోతాయి ఎగిసిపడి
కలతలు వీడిన
మనసులు చేరిపోతాయి
తీయని కలల ఒడి....
- కోడూరి రవి
Advertisement