ముప్పైరెండు సాలభంజికలు
ఎన్నికథలు చెప్పాయో
నాకుతెలియదు
నా నాలుగు కోళ్ళ(కాళ్ళ)మంచం
మా తాతలనుండీ ఎన్ని బతుకు
కతలు సెప్పిందో తెలియదు.
పేదవాడి పేగుల్లా కనిపించే
నులక మంచం.
బాల్యాన్ని
పిల్లలకోడిపెట్టలా పొదిగింది.
యవ్వనాన్ని
జడపెనవేసుకున్నట్టు
ఒదిగించేది.
సేదదీర్చే కలలపల్లకి
నా నులక మంచం!
కష్టాలను నలుగురూ చేరి
ఆదుకున్నట్టు
నాలుగు కాళ్ళతోఆదుకొనేది...
మా తాతను బిడ్డలా ఎత్తుకొని
మోసిన తల్లిలాగే ఉండేది.
మా అమ్మ
పురిటినొప్పులకు సాక్ష్యం
నన్ను అమ్మప్రక్కనే పెట్టి
పాలు తాపిన మా నాన్నమ్మలాగే.!
నోరులేకున్నా లోకంలో నిద్రకు
పూలపాన్పు పట్టేది.
వెతలకు వేదనలకు
ఎన్నో ఓదార్పులు రాత్రంతా
చెప్పినట్టే ఉండేది.
జ్వరమొస్తే నా కన్నా
తానే బాధ పడేది.
"అయ్యో!బిడ్డా!
ఎంత కష్ట మొచ్చిందిరా నాయనా!"అంటూ బాధపడేది
"కోడి కూసిందిరా నాయనా "
అని మేలు కొల్పేది
కలరా వచ్చినరోజు కలవరపడింది.
మసూచి వచ్చినరోజు
మనోవేదన పడేది.
గాయాలైన రోజు.
తనూ గాయపడినట్టుబాధ పడేది!
పక్షవాతం గల మా తాతను
ఇరవైనాలుగు గంటలూ
జారిపోకుండా చూసుకొంది...
మా వడ్రంగి
ప్రతిమంచానికి
మనసును ప్రతిష్ఠింపజేసే ఉంటాడు...
ఆయనో విశ్వకర్మ వారసుడు కదా!
తనకు విశ్రాంతి దొరికినప్పుడు
పగలు లేచి నిలబడేది.
దాని ఊహలనిండా
వెన్నెల రాత్రులు.
మా కైతే ఎన్ని కథలు వినిపించేదో వీధిలో...పరచుకొని...వేసవి లో
గాలిని వింజామరచేసేదేమో...
వెంటనే నిద్ర
ప్రవేశద్వారాలు తెరిచేది...
మంచం మాపంచప్రాణం
మా కష్ట సుఖాలలో తోడుండే
మా ఇంట ధైర్యం
- కిలపర్తి దాలినాయుడు