నువ్వు ఎంచక్కా దుక్కి దున్ని
విత్తనాలుజల్లి కమతాన్ని చూసి తృప్తి పెదాలకు రాసుకుంటావ్
మట్టి వాసనని ఒళ్ళంతా అద్దుకుంటావ్
నేనూ అంతే..పిడికెడు అక్షరాలు గుప్పిటపట్టి
తెల్లని కమతంలో విత్తుతుంటా..
ఆ ముత్యాలసరాల దండ పేర్చిన వాక్యాల
పరిమళం మనసుకు రాసుకుంటా
కమ్మని కవితల మువ్వలసడిలో పులకితను పెదాలకద్దుతా
నీది ఏడాదికో ఏరువాక...నాకు ప్రతి నిద్రలేని రాత్రీ ఏరువాకే
కంటికాలువకు గండిపెట్టి గుండెకమతాన్ని తడి చేస్తూనేఉంటా..
ఆలోచనల హలం రోజూ..గుండెకి గాడిపెడుతూనే ఉంటుంది
ఒక్కో ముత్యాన్నీ కలల స్వేదంతో తడిపిచల్లి
కవిత పండాలని నేనూ ఎదురుచూస్తేనే ఉంటా..
నీది నేల తడి..నాది గుండె తడి
నీది పచ్చని వ్యవసాయం.. నాది అక్షరాక్షర సేద్యం
నీదీ నాదీ ఎదురు చూపేగా చివరికి
బ్రతుకు పుస్తకంలా నీవూ..అచ్చునోచుకోని పుస్తకంలా
నేను
అదీ మన స్నేహం
-కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్,
(చీరాల)