కల్తీ గురించి వ్రాయమనీ
వీలుజూసుకొని
తొందరగా వ్రాయమనీ
ప్రజాశ్రేయస్సుకోరే
పాపారావ్ ఒకటే పోరు
ఇకజుస్కోండి
కల్తీలేని నికార్సయినరాత!
నట్టింట్లో వినోద మాధ్యమాలు
హాస్యానికి రంకుగట్టి
ఎదిగే యవ్వనపు మొక్కలకి
బరితెగింపు అంట్లుగడుతున్నాయి!
వేదమంత్రాలగూడిన బంధాలుతుంగనద్రొక్కి
తుచ్చపు సుఖాలకు
బజారునపడి
వ్యక్తిత్వాలను కల్తీజేసుకొని తిరుగుతూ
జీవిత భాగస్వాముల చంపేసుకుంటున్నారు!
నిష్పాక్షిక సమాచార మాధ్యమాలమని
పార్టీల భావజాలాలకు
కొమ్ముకాస్తూ
వీక్షకులకా రంగుటద్దాల్లోంచి చూపుతూ
అభిప్రాయాల
కల్తీ చేస్తున్నాయి!
అద్భుతాలు చేయగల
సత్తావుండీ ప్రభుత్వాలు
బద్దకత్వాన్ని అసమర్ధతని కల్తీజేసుకొని
ఎవరికోపుట్టి ప్రయోజకులైన బిడ్డలకు
తమగోత్రనామాలు పెట్టుకొని కులుకేస్తున్నాయి!
చట్టసభలలో అశుద్ధం
మాట్లాడుతూ
మగతనం కల్తీ అయ్యిందనీ
తొడగొట్టి చిటికలేస్తూ మీసందిప్పుతూ
తేల్చుకుందామని సవాళ్ళు చేసుకుంటున్నారు!
పైపదవుల ప్రాపకానికై
జవాబుదారితనాన్ని
తాకట్టుబెట్టి
మారుగా కల్తీస్వామిభక్తిని
తెచ్చుకొని
దొరగార్లకి ఉద్యోగులు దాసోహమంటున్నారు!
అమాయకపు జనమేమో
పప్పూ ఉప్పూ విత్తనాలూ వాగ్దానాలన్నీ
సర్వం సకలం కల్తీ
అయిపోయాయని
కాపుకాయాలని దేవుడ్ని వేడుకొంటున్నారు!
- రవి కిషోర్ పెంట్రాల
(లాంగ్లీ, లండన్)