నా ఆలోచనలు
కాలం తో జతకట్టి
నాతో కవిత్వం వ్రాయిస్తున్నాయి
నా మనసే కలమై
అనుభవాల పందిరిలో
సాహితీ సుమాలను
గుచ్చుతన్నాయి
అక్షరాలను ప్రోగు చేసుకుని
ప్రతి ఉద్విగ్న క్షణాన్ని ఎదుర్కొని
మానసిక సంవేదనలను
సందేశాలు గా చేసుకుని
కొత్త కొత్త పాఠాలు నేర్చుకొంటూ
జీవనానికి కొత్త భాష్యం చెబుతూ
భావాలకు అక్షరరూపం తెలియక
మనసు లోని సంఘర్షణ కు
సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాను
మనిషి లో మార్పు రాదా
ఇగో ని వదల లేని మనుషులను
సాటి మనిషి ఎదుగుదలను
ఓర్వలేని మనుషులను
మార్చేదెవరూ
నా కవితలు...
నా భావప్రకటనలు
నేను చెప్పే నాకు తెలిసిన మాటలు
నా అనుభవాల జ్నాపకాలు
మార్చగలవా కొందరినైనా
నా కవిత
వర్తమాన కడలిలో
ఎగసిపడే అలల
విజ్ఞానపు కెరటం
నా కవిత.
విశ్వ శాంతిని ఆకాంక్షించే
అక్షర కపోతం
నా కవిత
అవినీతి ఎదుర్కోగల
పాశుపతాస్త్రం
నా కవిత
పుడమి తల్లి క్షమాగుణాన్ని
అలంకరించుకున్న
అనురాగ వల్లి
నా కవిత
కళ్ళే వెంకటేశ్వర శాస్త్రి
(బెంగళూరు)