కాసేపు పడుకో
ఒక దోవ దొరుకుతుంది
దుర్గమారణ్యంలో కూడా
ఒక దోవ దొరుకుతుంది,
గూడు కట్టుకున్న చీకటిలాంటి అరణ్యంలో కూడా
సన్నని వెలుగులాంటి ఒక దోవ దొరుకుతుంది,
జీవితమే అరణ్యమైన చోట
శిథిలానగరమైన చోట
మానవుడు ఏం చేయాలి-
గుండె తీసి కాగడాలా చేత్తో పట్టుకుని నడవాలి
నిజం- మార్గం లేనిదేదీ లేదు-
నిజం- ఈ నదిని దాటడానికి
ఒక తెడ్డు దొరుకుతుంది.
వెతకాలి, వెతుకుతూ పోవాలి
ఎప్పుడూ వెతకటమే జీవితం.
చిక్కని, అంతుచిక్కని కొండల మధ్య నడుస్తుంటాం.
వాటిని రాతివనాలని భావించు
ఏ పక్క నుంచో చంద్రరేఖ వొకటి తోస్తుంది.
ఎక్కడన్నా కూర్చుని
వెతలమూట విప్పి ఒక ముద్ద తిను-
ఎప్పుడూ ఇంతేనా?
పైన చంద్రుడున్నాడు, సూర్యుడున్నాడు.
ఆకాశముంది, సమస్త విశ్వముంది
కింద మానవుడున్నాడు.
ఎప్పుడూ దేనికీ చెక్కుచెదరని
మానవుడున్నాడు.
మార్గాంతరం వెతికే మానవుడున్నాడు.
మానవ నిర్మితమైన జీవితముంది.
ప్రకృతికి ప్రతీక అయిన మనిషున్నాడు-
ప్రకృతి మనిషి ఒకటే
తాటి మొవ్వులాంటి మార్గమొకటి పొడుచుకొస్తుంది.
ఎదురుగా కాలవలాంటి
కాలి దోవ వొకటి కన్పడుతుంది.
'ఓహోం ఓహోం' అంటూ
జీవితాన్ని మోసుకుంటూ
ఊరేగించు, నలుదిశలా ఊరేగించు
- కె. శివారెడ్డి