అంధ ప్రపంచం మధ్య

Advertisement
Update:2023-02-07 17:12 IST

ఒక చిన్న కత్తి

తీసుకొచ్చి

పూరి కత్తిలాంటి కత్తి

ఎదురుగ్గా నిలుచున్నాడు

చేయిచాచి

తీసుకో ఈ పుష్పం అన్నాడు

చిన్నపిల్లను నాకేంతెలుసు

మరకలుండ

కూడదన్నాను

నెత్తురుమరకలుండకూడదన్నాను

పువ్వన్నమీద కన్నీరు

కురవకూడదన్నాను

ఇది పువ్వుకాదు

కత్తి అన్నాడు

నాకు కత్తివద్దు

పువ్వే కావాలన్నాను

అతడు గాల్లో చేతులుతిప్పి

కళ్లలాంటి

రెండు పూలను

సృష్టించాడు

అది పువ్వో కత్తో కన్నో

తెలియనిదాన్ని

నాకు పూలంటే ఇష్టం

చిన్నపిల్లల పెదాల్లాంటి

పూలంటే మహా ఇష్టం

లోకం నెత్తుటి పూలను సృష్టిస్తుంటే

ఏడ్చిఏడ్చి గుడ్డిదాన్నయ్యాను

ఎవరో వీపురుద్ది

సమాధులగుండా నడిపించి చేల మధ్య నిలుచోబెట్టారు

చేత్తో తడిమిచూసాను

వరికంకులు

చేతికి తగిలాయి

బంగారం వాసనవేసింది

నాపక్కనుంచి

ఒకపాములాంటి

కాలువ పాకిపోయింది

నేనక్కడ నుంచుని

అకాశం కేసి చూసాను

ముక్కుతో పీల్చాను

నాకు పూవు

కావాలంటే

కత్తులిచ్చారు

కత్తులెందుకంటే

కళ్ళు తీసేస్తారు

అంధ ప్రపంచం మధ్య

అణగారిన జాతుల కథ చెబుతూ

ఒక సంగీత పక్షిగా

మారిపోయాను

-కె .శివారెడ్డి

Tags:    
Advertisement

Similar News