ఖాళీ (కవిత)

Advertisement
Update:2023-09-30 13:03 IST

రోజు ఉదయం అతను

రాలిన ఎండుటాకులా

ఇంటి నుంచి నడిచి వచ్చి

ఆ బాలికల ప్రాథమిక పాఠశాల ముందు

డి విటమిన్ కోసం

లేత ఎండ కాగుతుంటాడు

అతడు ఒక పదవీ విరమణ

పొందిన ఉపాధ్యాయుడు

జీవిత కాలం అంతా

ఉత్తమోత్తమ ఉపాధ్యాయుడుగా

బడిని గుడిలా తల్లి ఒడిలా

భావించి ఆరాధించాడు

ప్రతి దినం పాఠశాల బోర్డును

పదేపదే తదేకంగా చూస్తూ

అక్షరాలను కలిపి చదువుకుంటాడు

దాని వెంట వెళ్లే వారు

అతనికి రెండు చేతులు ఎత్తి మొక్కి

షుగర్ కంట్రోల్ నడకను ప్రారంభిస్తారు

ఇటీవలనే భార్య చనిపోయి

గుడ్డి కొంగలా ఒంటరిగా కుంటుతున్నాడు

బతుకు జ్ఞాపకాలన్నీ వేపకాయల్లా

కారు చేదును మిగిల్చాయి

ఆయన కూర్చున్న స్థలం

తేజోవంతంగా వెలిగి పోయేది

ఒకరోజు వేకువ పువ్వు

వెలుగు నవ్వుల్ని

చిందిస్తున్న వేళ

అటువైపు చూశాను

అతడక్కడ లేక వెలితిగా ఉంది

అక్కడ గొడుగులా నిల్చున్న

చెట్టు కొమ్మకు

అతని శ్రద్ధాంజలి ఫ్లెక్సీ ఫోటో జీరాడుతుంది

- జూకంటి జగన్నాథం

Tags:    
Advertisement

Similar News