నమ్మకం (కవిత)

Advertisement
Update:2023-05-10 01:05 IST

ప్రపంచాన్ని నడిపించేది

ఓ నమ్మకం

అది లోపించిన నాడు

జరిగి పోదా

ఒకరిని ఒకరు అమ్మకం!

మావటి వాడెంత ఓ ఉండ

ఏనుగు ఓ కొండ

అయినా అంకుశంతో

పొడిచి పొడిచి

తాననుకున్న మార్గాన్ని నడిపించు

వళ్ళు మండి తొండంతో

తిప్పి తిప్పి కొడితే

పిండి పిండయిపోడా

తననేమి చేయదని ఓ నమ్మకం

లక్షలు కోట్లు డబ్బు తీసుకుని

తెల్ల కాగితంపై

ఓ సంతకం చేసి ఇస్తే

కళ్ళ కద్దుకుని దాచుకుంటున్నావే

కాలం గడచే కొలది

కాల దోషం పట్టింది పొమ్మంటే

కాగితం నాలుక గీచుకోను కూడా

పనికి రాదు

అయినా

తన వంశం పరువు కోసం

బిడ్డల పరపతి కోసం

వడ్డీతో కూడా కడతాడని ఓ నమ్మకం!

పడుచు భార్యను వదిలేసి

పతి బ్రతుకు తెరువుకై

పరదేశం వెళితే

సంవత్సరాల తరబడి రాకుంటే

గాడి తప్పను ఓ క్షణం పట్టదు

అయినా!

చంద్రుని వెన్నెల సోనల కోసం

చకోర పక్షిలా ఎదురు చూస్తుందని

అతని ప్రగాఢ నమ్మకం!

ప్రపంచాన్ని నడిపించేది

ఓ నమ్మకం

అది లోపించిన నాడు

జరిగి పోదా అమ్మకం

- జంజం కోదండ రామయ్య

(జమ్మిపాలెం ,నెల్లూరు)

Tags:    
Advertisement

Similar News