ఊరుకోదు.. వీడిపోదు! (కవిత)

Advertisement
Update:2023-07-28 23:10 IST

అబ్బబ్బ!

దీనికి ఆది..అంతం లేదు

అనుక్షణం నడుస్తూనే ఉంటుంది

ఏ పని చేస్తున్నా

దీని సైడ్ ట్రాక్ తప్పదు

ఎక్కడున్నా విడువదు

గొలుసు తెగినట్లే తెగుతుంది

మళ్లీ మొదలును వెదుకుతూ మొదలవుతుంది

చాలా సార్లు అర్థం లేని నడకే

క్రమమూ ఉండదు..

కుదురూ ఉండదు

వర్తమానం నుంచి గతంలోకి

గతం నుంచి భవిష్యత్తుకు

మళ్లీ వెనుతిరిగి గతానికో,

ప్రస్తుతానికో

అందులో ఎన్నో

అసందర్భ సందర్భాలు

ఎవరెవరో వ్యక్తులు..

ఎక్కడెక్కడో తావులు

దాని ఇష్టమే ఇష్టం!

కొన్నిసార్లు పనిలో ఉన్నా

పట్టుకుని వదలదు

అలసి నిద్రిస్తానా

అప్పుడూ ఊరుకోదు

కలగా మారి కలవర పెడుతుంది

నిద్ర లేస్తానా..

కల చుట్టూ కలయతిరుగుతుంది

నాకెందుకిలా?

ఆలోచనగా చూశా నలువైపులా

అన్ని ముఖాల్లోనూ

తొంగిచూస్తూ అదే!

ఇదేంటబ్బా..

మళ్లీ ఇదొక ఆలోచన

ఆలోచనపై ఆలోచన

ఆలోచనలో ఆలోచన

ఆవృతమవుతూ ఆలోచన!

- జె.శ్యామల

Tags:    
Advertisement

Similar News