తరువులు నా గురువులు (కవిత)

Advertisement
Update:2023-01-07 14:19 IST

తరువులు నా గురువులు (కవిత)

అలనాడెప్పుడో ఓ ప్రభాతాన

పెరట్లో విత్తులు చల్లి,

నీళ్లు చిలకరించానంతే

నాలుగునాళ్లకే ముసిముసి నవ్వుల మొలకలుఎదుగుతూ,

చివురులు వేస్తూ చిరునవ్వులు

మారాకు వేస్తూ మందహాసాలు

కొమ్మలూపుతూ కుశల ప్రశ్నలు

పచ్చని రూపుతో కనులకు విందులు

సుగంధ గాలులతో సుస్వాగతాలు

ఎటువంటి ఫలాపేక్ష లేకనే

పత్ర ...పుష్ప.. ఫల బహుమతులిస్తూ

ఎండను తాము స్వీకరించి, నీడను నాకు పంచి

ఏ చీడో పట్టిందని కొమ్మలు విరిచేసినా

కూలని ఆత్మవిశ్వాసంతో

కులాసా చిక్కించుకుని

మళ్లీ చివురులు తొడిగి

చిద్విలాసంగా మారాకులు వేసి

వడివడిగా ఎదిగి

వసంతగానం చేస్తూ

చేవ అంటే ఏమిటో

చెప్పకనే చెప్పిన తరువులు

నేను చేయెత్తి మొక్కే గురువులు!

- జె.శ్యామల

Tags:    
Advertisement

Similar News