ఉదయపుటెండ లో
ఆపసోపాలతో
అంటకాగుతుంటే
అపశ్రుతుల గంగిరెద్దు మేళం
అనవరతం అడిగేది మాధాకోళం
అనుక్షణం గతి తప్పుతునే ఉన్న తాళం
వేళ కాని వేళ కాలం ఆడిన వేళాకోళం
అంతా అయోమయం గందరగోళం
ఉబ్బరం ఉక్కపోత
డాబర్ మాన్, జెర్మన్ షెపర్డ్
దాల్మేషియన్, సెయింట్ బెర్నార్డ్
మరి ఈ మొరిగే కుక్కలదే జాతి
కరిచే కుర్కురాలదే పెడిగ్రీ ???
'ఎంటైర్ పొలిటికల్ సైన్స్' లా
చదవకనే వచ్చి వాలే పీజీ డిగ్రీ
యేల్ లో చదవని ఏలినవారూ
చికాకు పెట్టిన చికాగో డాక్టరేట్
జ్జానుల మీద, వైజ్జానికుల మీద
రాజకీయులు వేసిన పేలని జోక్
అందరూ శంకర్ దాదా ఎంబీబీయెస్ లే ...
తరగని భ్రాంతి, కరిగిన శాంతి
మార్తాండుడు మండుతుంటే
మండుటెండే మలయమారుతం లా
గాలి మాటల సాముగరిడీలు
అమ్మ, అయ్య ల అప్పు రద్దులు
అనుచితోచితాలు
అర్థంలేని అరవ గోల
లంబోర్ఘినీ, ఫెరారీ
ఆస్టిన్ మార్టిన్, బీ ఎం డబ్ల్యూ
అన్నీ ఫ్రీ గా ఇస్తామంటారేమో
వాళ్ళదేం పోతుంది
ఊడేది ఊడిగం చేస్తూ ఊరేగే
ఉద్యోగస్తులదీ...
పంచెలెగ్గట్టి, పరికిణీలు పైకి పెట్టి
పమిట కొంగు బొడ్లో దోపి
అమ్మ ఉప్పూ, అయ్య కారం
అనుకుంటూ ఆవేశపడే అమాయకులదే
ఆ తర్వాత అంతా
తరతరాల
అంతరాలే, అనంతరాలే
అంతా రాలే,
అర్థరాత్రి ఆకాశం లో హాహాకారాలు
అపరాత్రి భళ్ళున తెల్లారినట్టు
కళ్ళు మిరుమిట్లుగొలిపే
ఉరుములూ మెరుపులూ
అమాంతం అప్ రూటైన
ఏళ్ళనాటి తరువులు
అయినా ఊళ్ళకు ఊళ్ళని
కమ్ముకున్న కరువులు
బీళ్ళు పడ్డ పొలాలూ
వేళ్ళూనని పంటలూ
ఒళ్ళు గుల్ల చేసుకుని ఎండిన బావుల్లో
నీళ్ళు తోడే తల్లులూ
కళ్ళుండీ చూడలేని కబోదులైన ప్రభువులు
ఎండ్ కాలమా
ఎండా కాలమా
- సాయి శేఖర్