నాకు భయం వేస్తోంది ... నిన్ను చూస్తే
సందర్భం: అడ్వైజర్ ని అంటూ ఒచ్చి అందరినీ చులకన చేస్తున్న ఒక నికృష్టుడి మీద కోపంతో మొదలైన కవిత, నిర్భయ మీద జరిగిన అత్యాచారం లాంటిది బెంగుళూరు లో జరిగినా ఏ చర్యా తీసుకోని ప్రభుత్వాల మీద ఆగ్రహం, ఫ్రాన్స్ లో ఫుట్బాల్ స్టేడియంలో రాక్బ్యాండ్ ప్రేక్షకుల మీద తీవ్రవాద మూకల దాడి, కాల్బుర్గి హత్య, దాద్రి లో ఆవు మాంసమని భ్రమసి అమాయకుణ్ణి చంపిన తీరూ .... ఇలా ఎన్నో ఆగ్రహాల సమాహారం ఈ కవిత. నవంబరు 15 న వ్రాసింది
నాకు భయం వేస్తోంది ...
యెస్ ...
అయాం అఫ్రైడ్ అఫ్ యూ ...
ఎందుకో తెలీదు...
కాదు ...
తెలుసు ...
అది కూడా బయటకి చెప్పలేనంత భయం వేస్తోంది ...
అవమానిస్తావని భయం
నువ్వూ ...
నీ అంతేవాసులు ...
కాకుల్లా గద్దల్లా ...
పీక్కు తింటారని
నా వ్యక్తిత్వాన్నీ ...
నేను పేర్చుకున్న కలలనీ ...
నేను పెంచుకున్న ఆశల్నీ ...
నేను నమ్మిన శాంతినీ
నేను ప్రాక్టీస్ చేసే సహనాన్నీ
నేను ఆరాట పడే ఆనందాన్నీ
నా ప్రేమనీ ...
నా అనుబంధాల్నీ
నా అన్నింటినీ ...
ఆఖరికి నన్ను కూడా ...
చిదిమి చిందేసి చిత్తు చేసి
ముక్కలు ముక్కలు గా
పీక్కు తిని
ఆ బొక్కలు కూడా
కుక్కలకీ నక్కలకీ
పాట్ లక్ డిన్నర్ లో
షేర్ చేస్తారనీ ...
నిన్ను ఊహించుకుంటేనే
భయం వేస్తోంది ...
నిర్భయ మీద జరిగిన పాశవికత
రోజూ ఎక్కడో ఒక చోట
జరుగుతూనే ఉన్నా ...
సరిగ్గా .. అదే తీరులో ...
నిన్నటికి నిన్న బెంగుళూర్ లో
రిపేట్ అయితే
నీకు చీమ కుట్టినట్టైనా లేదు ...
నాకూ ఆశ్చర్యం కలగలేదు ...
కానీ...
గుండె గొంతులొకొచ్చింది ...
నీ సైలెన్స్ వింటే భయం వేస్తోంది ...
అమెరికన్
రాక్ బ్యాండ్ వైబ్రేషన్ లో
ఓలలాడదామని
సేద తీరదామని ...
బటాక్లాన్ కాన్సర్ట్ హాల్ కి వచ్చిన
రసజ్ఞులనీ ...
జర్మనీ - ఫ్రాన్స్ ఫ్రెండ్లీ ఫుట్ బాల్
ఆట చూస్తే ఆట విడుపు గా ఉంటుందని
స్టేడ్ డె ఫ్రాన్స్ స్టేడియానికి
వచ్చీన
ఆహూతులనీ ...
అమాంతం మట్టు పెట్టీ
అది మేమే చేశం అని
ప్రకటించిన ...
బుద్ధి వికటించిన
ఆటవికులను చూసి
నువ్విచ్చిన రియాక్షన్ ఉందే ...
అది చూస్తే, వింటే ...
నిన్ను చూడకపోయినా
భయం వేస్తోంది ...
కాల్బుర్గి ని కాలం బుగ్గి చేసినా
కులకర్ణి మొహాన పొరపాటున
నల్ల ఇంకు పడినా
దాద్రీ లో ప్రమాద వశాత్తు ఒక మరణం సంభవించినా ...
ఏదొలే
అని సర్దుకుపోయే వాళ్ళే ఎక్కువ
కానీ ..:
ఇప్పుడు భయపడుతున్నారు
తెలుగు లో, కన్నడ లో ...
తమిళం లో ... బెంగాలీ లో
మరాఠీ లో ... హిందీ లో ...
మళయాళం లో
ఫ్రెంచి లో జర్మన్ లొ
ఆఖరికి ఇంగ్లీషులో కూడా ...
నిన్ను తలుచుకోకుండనే భయపడుతున్నారు ...
ఇంతకీ నువ్వెవరు ?
నీ రంగూ, ఆకారం, లక్షణం ఏంటి
నీ రూపు రేఖా విలాసాలేంటి
నీ నడత మాత్రమే మాకు తెలిసింది
నీ నడక తెలియలేదు ...
ఆ అడుగుల అలికిడి వినకుండానే
ఆ ఊపిరి సవ్వడి మనకుండానే
ఆ నాలుగు ముద్దలు తినకుండానే
ఆ నెత్తుటి ఆవిరి సెగ కనకుండానే
ఆఖరికి నీ పొడ సోకకుండనే
భయం వేస్తోంది ...
ఓ నువ్వూ ... రేపు రా
ఒద్దు ... రాకు ...
అస్సలు రానే రాకు ...
ఎందుకంటే
నాకు భయం వేస్తోంది
అయాం అఫ్రైడ్ ఆఫ్ యూ
- సాయి శేఖర్