'రెక్కలు' విచ్చి ఎగిరిపోయిన కవి హంస సుగమ్ బాబు
గుంటూరుకు చెందిన సుగమ్ బాబు రచయిత, దర్శకుడు, జర్నలిస్టు కూడా. జర్నలిజంలోకి రాకముందు సుగమ్ బాబు మద్రాసులో మనసు కవి ఆత్రేయ గారి దగ్గర, ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రెడ్డిగారి వద్ద పనిచేశారు. కొన్ని సినిమాలకు మాటలు రచయితగానూ, దర్శకత్వ శాఖలోనూ పనిచేశారు.
ప్రముఖ కవి, పైగంబర కవుల్లో ఒకరైన సుగమ్ బాబు ఈ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
గుంటూరుకు చెందిన సుగమ్ బాబు రచయిత, దర్శకుడు, జర్నలిస్టు కూడా. జర్నలిజంలోకి రాకముందు సుగమ్ బాబు మద్రాసులో మనసు కవి ఆత్రేయ గారి దగ్గర, ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రెడ్డిగారి వద్ద పనిచేశారు. కొన్ని సినిమాలకు మాటలు రచయితగానూ, దర్శకత్వ శాఖలోనూ పనిచేశారు.
ఆయన ముక్కుసూటి మనిషి. ఒకరి మెప్పుకోసం ఎప్పుడూ పాకులాడ లేదు. ఎవరికి కోపాలు వచ్చినా నిజాన్ని నిర్భయంగా చెప్పడం ఆయన స్వభావం.
సుగమ్ బాబు 1984లో తీసిన 'గురజాడ అప్పారావు జీవితం -సాహిత్యం ' డాక్యుమెంటరీ కి 1985 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంగారు నంది అవార్డు లభించింది.
సుగమ్ బాబు 'రెక్కలు' అనే ఒక వినూత్న సాహితీ ప్రక్రియకు ఆద్యులు. కొన్ని భాగాలుగా వెలువడిన 'రెక్కలు' ను ఒకే సమగ్ర సంపుటంగా ప్రచురించారు.
ఏ కళ అయినా దుఃఖంలోంచే పుడుతుందనీ , దుఃఖాన్ని పోగొట్టేందుకు దుఃఖం నుంచే రాశాననీ, ఏదీ ఊహించి రాయలేదనీ, చూసి అనుభవించి రాశాననీ సుగమ్ బాబు పేర్కొనేవారు
వారి సమగ్ర సంపుటిలో... రెక్కలు, అంతర్థానం, శిఖరం, దారి, చెరుగ్గడ అనే అయిదు విభాగాలున్నాయి.
'రెక్కలు' కొన్ని విదేశీ భాషల్లోనూ, తమిళంలోను అనువదించబడింది. విదేశీయులు కూడా ప్రశంసించారు.
సుగమ్ బాబు దార్శనికుడు. తాత్వికుడు. ఆయన రచనల్లో మనకు ఈ చింతన ప్రస్ఫుటంగా కనబడుతుంది.
పైగంబర కవుల్లో ఒకరైన సుగమ్ బాబు చాలాకాలం జర్నలిస్టుగా పత్రికల్లో పనిచేశారు. 'మయూరి' వీక్లీలో ఆ రోజుల్లో' 'ప్రముఖుల పేజీ' పేరుతో నిర్వహించిన శీర్షికలో నిన్నటితరం కవుల గురించి రాశారు.
జీవితాంతం కవిత్వం లోనే బతికి, కవిత్వం కోసమే తపించిన కవి సుగమ్ బాబు.వారి మృతికి తెలుగు సాహితీ లోకం నివాళి ఘటిస్తోంది
................................................
సమాచార సౌజన్యం :
వి. మధుసూదనరావు.
సీనియర్ జర్నలిస్ట్.