పచ్చల హారం! (కథానిక)

Advertisement
Update:2022-11-03 13:01 IST

"కొత్తగా పచ్చల హారం కొన్నాను. మొదటగా నువ్వేపెట్టుకోవాలి అమ్మా ! "అన్నది రేఖ.

కూతురి ప్రేమ ని హాయిగా అనుభవించింది జీవంతి.

కానీ పచ్చల హారం మాత్రం పెట్టుకోలేదు.

ఒప్పుకోలేదు రేఖ.

తానే తల్లికి పెట్టి చిన్న అద్దం

తీసుకొచ్చి చూపించింది.

నవ్వి మెడలో హారం తీసి కూతురి చేతిలో పెట్టింది.

" ఎందుకమ్మా ? ఎప్పుడూ నవ్వవు? నవ్వితే ఎంత బాగుంటావు?" అంది రేఖ.

మౌనంగా ఉంది జీవంతి.

"ఎందుకు ఎప్పుడూ అరిగిపోయిన రికార్డ్ లా నేను అశోక్ ని వదిలి పుట్టిల్లు చేరానని స్పీచ్ ఇస్తావుగా?

ఇవ్వు .ఈ రోజు నువ్ ఏమి చెప్పినా వింటాను. నాకు ఈ రోజు వచ్చిన ప్రమోషన్ నా లైఫ్ కే

విజయాతివిజయం!" అంది.

" అశోక్ అభినందించాడా?" అడిగింది కుతూహలంగా.

" ఎవడి కోసం? ఇప్పుడు నేను బాస్ ని !" అంది గర్వంగా.

పక పకా నవ్వింది జీవంతి.

"ఆఫీస్ లో మాత్రమేగా?" అంది కూడా.

ఉక్రోషం ముంచుకొచ్చింది రేఖ కి.

" నేను పాతకాలం చింతకాయ పచ్చడినే కావచ్చు. కానీ నేను చెప్పేవి నిత్యాసత్యాలు.

ఒక్కసారి విను.

అశోక్ ఇప్పటి దాకా నువ్ పంపిన కాగితాల మీద సంతకం పెట్టాడా?

ఎందుకు?

బంధాన్ని నిలువుకోవాలనే ఒక సంస్కారం!" అనేసి అక్కడినుంచి వెళ్ళిపోయింది జీవంతి.

ఆఫీస్ కి వెళ్ళినా తల్లి మాటలే వెంటాడాయి రేఖని.

కేబిన్ తలుపు కొట్టారేవరో.

" కమిన్!" అంది.

వచ్చింది అశోక్ .

ఫైల్ మీద సంతకం పెట్టమని ఫైల్ చూపాడు.

కూర్చోమని ఫైల్ చూసింది.

మొత్తం చూసేసరికి పన్నెండు నిముషాలు పట్టింది.

తలెత్తి చూసేసరికి అతడు నిలబడే ఉండడం చూసి-

" మీరు కూర్చోవలసింది!" అని సంతకం పెట్టిన ఫైల్ అందిస్తున్నప్పుడు అతని చేతి వేళ్ళు తగిలాయి.

అతను వెళ్ళిపోయాడు.

చేతి వైపు చూసుకుంది.

'అసలు జరిగిన వాగ్విదాల్లో అతడి పొరపాటు ఏముంది?'

ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించింది.

★★★★★★

రేఖా! అమ్మా, నాన్న, చెల్లి వస్తున్నారు. 20 రోజులు ఉంటారు. యాహూ!" అన్నాడు.

రేఖ మొహం ముడుచుకుపోయింది.

వాళ్ళు వచ్చి వెళ్ళాక కానీ ఆమె మొహం విడలేదు.

కొన్ని రోజులు గడిచాయి.

ఆ రోజు రేఖ హుషారుగా చెప్పింది.

" మా అమ్మ, నాన్నగారు, తమ్ముడు వస్తున్నారు. పదిహేనురోజులు వాళ్ళని కళ్ళారా చూసుకోవొచ్చు!" అంది.

ముభావంగా ఉండిపోయాడు అశోక్.

వాళ్ళు వచ్చి వెళ్ళిపోయాక గొడవ మొదలయింది.

మా వాళ్ళ పట్ల నువ్ సరిగా ప్రవర్తించలేదంటే. నువ్వూ అంతేగా? అని.

చిలికి చిలికి గాలీ వానా అయింది.

రేఖ పుట్టింటికి వెళ్ళిపోయింది.

ఇది జరిగి ఆరునెలలు అయింది.

ఇప్పుడు కోపం లేదు.

కానీ పంతమే ఉంది రేఖలో.

అశోక్ సైలెంట్ గా ఉన్నాడు.

ఆలోచనలో పడింది రేఖ.

అప్పుడే వచ్చిన అశోక్ ని -

"అసలు ఆరోజు నా తప్పేం ఉంది?"అని అడిగేసింది.

" ష్! ఇది ఆఫీస్. జవాబు చెప్తాను .విను.

నీ తల్లితండ్రులు, తోడబుట్టిన వారిని నువ్వెలా మిస్ అవుతున్నావో..నేనూ అంతే.

కానీ నీ పుట్టింటి వాళ్ళని నువ్ మిస్ అవుతున్నావు గనుక నన్ను నీలా ఫీల్ అవమంటున్నావు.

నిన్ను నేను ఎందుకు అర్ధం చేసుకున్నాను అంటే మన ఇద్దరి ఫీలింగ్ ఒక్కటే గనుక.

కానీ నువ్వు నీ తల్లిదండ్రులకె ప్రాధాన్యత ఇవ్వాలని, మా తల్లితండ్రుల్ని గెస్ట్ లు గా చూడాలని ఆశించావు.

చూడు రేఖా! నువ్వంటే నాకు ప్రేమ.

నీ వాళ్ళూ నా వాళ్ళే.

కానీ నా వాళ్ళు నీ వాళ్ళు కాలేకపోతున్నారు.

నువ్ నన్ను నీ వాడిగా భావించడం వరకు సరే.

కానీ అధికారం తో నన్ను శాసించాలని అనుకుంటున్నావు.

నా మీద అధికారం చేలాయించడం కూడా నాకు ఇష్టమే.

ఎందుకంటే నేను నీవాడిని కనుక.

కానీ ఆ అధికారం లో ఒక అవిధేయత ఉంది.

ఒక చిన్న చూపు ఉంది.

మనమిద్దరం మన వారిని మనవారు అనుకుని ఉంటే ఈ ప్రోబ్లం వచ్చేది కాదు.

నేను మాత్రమే మీవారిని మనవారు అనుకోవాలని, నువ్వు నా వారిని ఆదరిస్తున్నందుకు నేను కృతజ్ఞత చూపించాలని భావించావ్.

మన వారు మన వారే కదా?

నువ్వు, నేను ఒక్కటి అనుకున్నప్పుడు వారిని చూడడం లో తేడాలు ఎలా వచ్చాయి?

ఆలోచించు.

ఇంతే సమస్య.

అప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావ్.

మూర్ఖత్వం తో ఆలోచనా రహితంగా ఉన్నావ్.

అందుకే వాదించలేదు నేను.

ఇప్పుడు నా మీద ప్రేమ తో నన్ను వదిలి ఉండలేనితనంతో అడిగావు గనుక ఇప్పుడు ఆలోచించగలవు.

ఈ ఫైల్ మీద సంతకం కావాలి మేడం!" అని అనగానే పక్కకి చూసింది.

మరో కొలీగ్ గౌతమ్ ఉన్నాడక్కడ.

★★★★★★

ఆ సాయంత్రం ఆఫీస్ ముగించే వేళకి ఒక ఫైల్ తెచ్చాడు అశోక్.

అది తీసి చూసి ఆర్జంట్ కాదని పక్కకి పెట్టి-

సూట్కేస్ తెచ్చుకోవాలి. మా ఇంటికి తీసుకెళ్తావా?" అంది.

ఆమెని అనుసరిచాడు అశోక్.

ఇంటికి వచ్చిన అల్లుడిని ఆప్యాయంగా ఆహ్వానించింది జీవంతి.

కాఫీ తీసుకుని వెళ్ళేసరికి -

" ప్రమోషన్ వచ్చినప్పుడు ఈ పచ్చల హారం కొన్నాను. అమ్మ మెడలో వేస్తే తప్ప నాకు నా హాయి ఫుల్ ఫిల్ అవదుకదా? వేసి తీస్తున్నప్పుడు కొక్కెం మెలి తిరిగింది. అది సరిచేసి నా మెడలో వేసేస్తావా?" అడుగుతోంది రేఖ.

అల్లుడు ఆమె దగ్గరగా వెళ్ళిన చిన్న శబ్దం.

జీవంతి మొహంలో జీవరేఖ వెలిగింది.

 - బులుసు సరోజినిదేవి.

Tags:    
Advertisement

Similar News