పరాయితనం (కవిత)

Advertisement
Update:2023-04-27 19:41 IST

ఎత్తుకున్న దరువు

ఏడేడు లోకాలు చుట్టి వచ్చేది

మైరావణుడుగా,వీరబాహుడిగా

ఏడు మెరువులు

ఒక్క లగువు లో దూకిన మనిషి

ఇప్పుడు మంచంలో

శిథిల రాగంలా పడుకున్నాడు

చెంచులక్ష్మి కథలో

ఎరుకులసాని చెప్పినట్టు

పంజరాన చిలుక

తుర్రుమనే కాలం

కార్తె కార్తెకు సామెత చెప్పే నోరు

ఊపిరి తీసుకోడానికి

గొలుసు తో కట్టిన ప్రాణిలా

విలవిలలాడి పోతోంది

ఎవరో వస్తున్నారు

నన్ను మోసుకెళ్తున్నారంటూ

డేగను చూసిన,కోడి పిల్లలా

వణికి పోతున్నాడు

చిమ్మ చీకటి పెను చీకటి

గుడ్లు పెట్టి,పిల్లలు పొదుగుతున్న చీకటి

లో లోపల గగ్గోలు పెడుతున్న ప్రాణం

కుడుతున్న కుమ్మరి పురుగు

నులక మంచం అల్లినట్టు

ఎందరినో కలుపుకున్నాడు

ఎంత కష్టం వచ్చినా

నిట్రాడి లా నిలబడి

నిబ్బరంగా ఎదుర్కొనే వాడు

ఇప్పుడెందుకో

తెలియకుండానే

కన్నీళ్లు పెడుతున్నాడు

ఎలపటెద్దు,దాపటెద్దు లా

సంసారాన్ని లాగి

ఆవలి గట్టుకు చేరినవాడు

శ్మశానాన్నికలగంటున్నాడు

పొంతలో సలసల కాగిన నీరు చల్లారినట్టు

తీగనుండి కాయ గుంజేసినట్టు

యాతన యాతన

ఏమి జన్మ తండ్రీ

ఏమి జన్మ

ఆత్మ ఇమడలేని పరాయితనం

(మా నాయన మంచంలో ఉన్నప్పుడు)

- గోపాల్ సుంకర

Tags:    
Advertisement

Similar News