ఈ నిశ్శబ్దం
ఆవరించే ముందు
విస్పోటనం గాంచే ఉంటావు
మౌనానికి పూర్వం
కురుక్షేత్రమే
కని ఉంటావు
అలజడుల జడివానలో
తడిచి మునిగి తేలి
ఈది ఈది
అలసిన మది రెక్కలు
నీదైన తీరానికి
చేర్చే ఉంటాయి
తీరం చేరేముందు
తెరచాపో
కొయ్య దుంగో
ఆసరా ఇచ్చే ఉంటాయి
చేరిన తీరం
తెచ్చిన భరోసా
ఏమి నేర్పింది నేస్తం
కనిపించే దాహం
తీర్చమనా...
కరుణ తలచి
కారుణ్యం పంచమనా
వంచన పంచ చేరిన
వేదనను తరమమనా
నిరంతర అన్వేషణలో
తీరం చేరిన నీవు
మానవీయ బడిలో
నిత్య విద్యార్థివే సుమా..!
- గోలి మధు
Advertisement