పచ్చ తిలకం

Advertisement
Update:2023-10-11 00:09 IST

ఏ పువ్వుకు కాసిందో

ఏ సీమలో వెలసిందో

ఆ బ్రహ్మ సృష్టికే ప్రతిసృష్టి చేసింది

అనంత కోటి జీవరాసులకు

ప్రాణమై నిలిచింది

అద్భుతాలు సృష్టించింది

అమృతం కురిపించింది

మన్ను గుడిలో

మహా తపస్సు చేసింది

చినుకు ఒడిలో సేద తీరింది

తడి కౌగిళ్ళల్లో ఒదిగిపోయింది

రవికిరణ స్పర్శకు

పులకించిపోయింది

పచ్చ పరువాల విందులు నాకందించింది

ప్రకృతి రమణీయతకు

సోపానం అయినది

గాలి కెరటాలలో తేలి పోయింది

విశాల బాహువులతో

విస్తరించింది

అమ్మకే జన్మనిచ్చింది

మళ్లీ అమ్మ గర్భం లోకే చేరిపోయింది

క్షేత్ర సింహాసనంపై

మకుటం లేని మహారాజైనది

అన్నదాత గుండెల్లో

గూడు కట్టుకుంది

అన్నార్తుల ఆకలి తీర్చిన

ఆ మహరాణి

నేడు స్వార్థపరులు తొడిగిన

నకిలీ ముసుగులో నలిగిపోయింది

తండ్రిలాంటి రైతుకు

తలకొరివి పెట్టింది

జీవవైవిధ్యచిరునామాఅయిన

నా దేహం కాలుష్యపు కాటుకు ఎండమావై అలమటిస్తే

కుమిలినశించింది

కాంక్రీట్ చేతులు

తమ కుటుంబాలను కబళిస్తుంటే

జరగబోయే అనర్థాలకు

సాక్షీ భూతం గా నిలిచింది

ఉపాయానికై అన్వేషించింది

సేంద్రియ ఎరువులతో చెలిమి చేసింది

పరిశోధకుల చేతిలో

మెరుగులు దిద్దుకుంది

రసాయనాలలో మునక లేసింది

ప్రమాణాల లేబుల్ లకు

రంగులద్దింది

మేలుజాతి వరసలో వచ్చి నిలిచింది

ప్రాణకోటికి జీవనమై

ఊపిరి చిరునామాయై

రైతన్న నేస్తమై

మేలు విత్తన మై వినుతికెక్కింది

విశ్వాన్ని గుప్పెట్లో బంధించింది

స్వార్థపరులను హెచ్చరించింది

గ్లోబల్ వార్మింగ్ వలన

వచ్చే నష్టాలను చూచాయగా చూపించింది.

ప్రకృతి వైపరీత్యాల వేటు నుంచి

ప్రజలను జాగృత పరిచింది

సస్యశ్యామల జగతి కి

స్వాగతం పలికింది

నామేనిపై సందడిచేసి

నా నుదుటి పై

పచ్చ తిలకం అద్దింది.

- ఘాలి లలితా ప్రవల్లిక

(అమిస్తాపూర్ ,మహబూబ్ నగర్)

Tags:    
Advertisement

Similar News