ఎందుకో
నువ్వలా చూస్తే చాలు
కాసేపు వెన్నెల్ని తెంపి
కళ్ళల్లో ఆరబోసుకుంటున్నాను .
చలి మంటల్ని దూసి
గుండెల్లో ఒంపేసుకుంటున్నాను .
నీ చూపుల్లో దీపాలు
కొద్ది కొద్దిగా
ఆశల సువాసనలు వెదజల్లుతున్నాయి.
నీ కొప్పులో మల్లెలు మురిసి
కోర్కెల పందిళ్లు వేస్తున్నాయి .
కాసిన్ని గాలులు ముసురుతున్నా
కొంటె చినుకులు తడుపుతున్నా
చిలిపి గాజులు అల్లరిచేస్తున్నా
వసంతం లో ఉత్సవాన్ని
నీ దేహ శిఖరాలపై ఆరేసుకుంటూ
క్షణాల్ని తాగుతున్నాను .
ఆకాశపు తీగలు లాగుతుంటే
జారే మేఘాల లోతుల్లోంచి
పరవశించి పరిమళించి
అమృతపు పరవళ్ళుగా
ఆ నదులు పొంగుతున్నాయి .
సీతాకోక చిలుకలు తట్టినట్లు
వొళ్ళంతా చుట్టినట్లు
నీ నయనాలు ఆక్రమించుకుంటున్నాయి .
క్షణాల్ని అలంకరించే
నువ్వు కాస్తా
ఇంకొంచం అలానే
నవ్వుతూ వుండు .
ఆశలు కౌగిలించుకున్నా
పూల ద్రవ్యాలు పంచుతున్నట్లు
ఆకాశం ఊగి పడినట్లు
రగిలిన ఆవేశాలు మత్తెక్కుతున్నాయి.
మరుక్షణం అలా భళ్ళున వర్షిస్తున్నాయి .
ఇక సుఖాలు చల్లని మేఘాలుగా తేలిపోతున్నాయి .
-గవిడి శ్రీనివాస్
(బెంగళూర్)