తొలితరం సాహితీ దిగ్గజం...నోరి నరసింహ శాస్త్రి

Advertisement
Update:2023-02-25 16:29 IST

నోరి నరసింహశాస్త్రి గారు అనగానే పందొమ్మిది వందల యాభై-అరవైల ఉన్నత పాఠశాల విద్యార్థులకు వారి ‘నారాయణభట్టు’ నవల గుర్తుకొస్తుంది. అది అప్పటి సిలబస్ లో కొన్నాళ్లు తెలుగు ఉపవాచకంగా ఉండేది.

చారిత్రక నవలా రచయితగా నోరి వారిది అఖండ విజయం. కవిత్రయంలో నన్నయ గురించి ‘నారాయణభట్టు’, తిక్కన గురించి ‘రుద్రమదేవి’, ఎర్రాప్రగడ గురించి ‘మల్లారెడ్డి’ నవలల్ని రాసి ఆ కవుల జీవిత చరిత్రల్ని అజరామరం చేశారు,

తెలుగు నవలా ప్రియులకు వాటిని పఠనీయ గ్రంథాల్ని చేశారు. ఇవిగాక వారు – శ్రీనాథుని గురించి ‘కవి సార్వభౌముడు ’నీ, పోతన జీవితం ప్రధానేతివృత్తంగా ‘కవిద్వయం’నీ, ధూర్జటి జీవన సాఫల్యం గురించి ‘ధూర్జటి’ నీ నవలీకరించి లబ్ధప్రతిష్ఠులైనారు.

అజంతా గుహల శిల్పాల ఆవిర్భావానికి సంబంధించిన కథ ప్రధానవస్తువుగా ‘వాఘిరా’ నవలను అందించారు.

‘చారిత్రక నవలారచనలో అడవి బాపిరాజును శరదృతువుతో పోలిస్తే నోరి వారిని వసంతరుతువుతో పోల్చటం సముచితం. ఇద్దరూ గొప్ప ప్రతిభావంతులు. అయితే నోరి వారు రాజరాజ నరేంద్రుడి నుండి శ్రీకృష్ణదేవరాయల వరకు ఐదు శతాబ్దాల తెలుగు సాహిత్యానికి ఎట్లా చిరస్మరణీయులైనారో తన నవలలో తమ సృజనాత్మక ప్రతిభతో రూపు కట్టించారు. చరిత్ర చదవటం కన్నా సృజనాత్మక సాహిత్యం చదవటానికి సామాన్య పాఠకులు ఎక్కువ కుతూహలం చూపుతారు. ఆ ప్రయోజనం నోరి వారి చారిత్రక నవలలు సిద్ధింపజేశాయి’ అని ప్రశంసించారు డా. అక్కిరాజు రమాపతిరావు(మంజుశ్రీ) గారు.

నోరివారు తమ 18, 19 సంవత్సరాల వయస్సులోనే సాహిత్య కృషిని మొదలెట్టారు. నవ్యసాహిత్య పరిషత్తు, తల్లావఝల శివశంకరశాస్త్రి ప్రభావంతో, జాతీయోద్యమ స్ఫూర్తితో వారు తమ అక్షరయాత్రను ప్రారంభించారు. మొదటి మూడు దశాబ్దాలు – కథ, కవిత్వం, నాటక రచనలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తర్వాతి మూడు దశాబ్దాలు – నవల, సాహిత్య విమర్శ, పుస్తక సమీక్ష, వ్యాస రచన వంటి ప్రక్రియల్లో తమ ప్రజ్ఞా ప్రాభవంతో సాహిత్యానికి ఔన్నత్యాన్ని సమకూర్చారు. వేయి పుటల సాహిత్య విమర్శ, నూరు సమీక్షలు గ్రంథస్థమై ఉన్నాయి.

‘దేవీ భాగవతం’ రచించి వారు ‘కవి సమ్రాట్’ బిరుదును పొందారు.

శాస్త్రిగారికి తత్త్వశాస్త్రం, దేశచరిత్ర, ప్రపంచ సాహిత్య ప్రస్థానం అభిమాన విషయాలు. వారికి సంగీతంలో సాధికారికమైన అభినివేశం, ప్రతిభ వున్నాయి.

తొలితరం కథా రచయితగానూ నోరివారు ఎంతో సుప్రసిద్ధులు. పౌరాణికేతివృత్తాలతో వారు రాసిన – ‘మరువిషయము’ ‘భవిష్యత్తు’ ‘వధూసర’ అనే మూడు కథలూ – శైలీశిల్పాలు, నిర్మాణ విధానం పట్ల ఆసక్తీ, అనురక్తీ గల రచయితలు తప్పక చదివి విశ్లేషించుకోదగినవి. ‘వధూసర అంటే వధువు కన్నీటి ప్రవాహం! మహాభారత ఆదిపర్వంలో రేఖామాత్రంగా ప్రస్తావింపబడిన వస్తువు ఆధారంగా అపూర్వమైన కరుణరసాత్మక కథను వ్రాశారు నోరివారు!

శాస్త్రిగారి ఖండకావ్యాలు, పద్యగేయ రూపకాలు ఎంతో విలక్షణమైనవి. ఉదాహరణకు 1967 చివర ‘భారతి’ మాసపత్రిక మూడు సంచికల్లో వచ్చిన ‘పూజావనము’ దానికదే సాటిగా సాహితీవేత్తల, పాఠకుల మన్ననల్ని పొందింది. ఈ రూపకంలో యాభై రకాల పూలు ఒక దంపతి ద్వయంతో మాట్లాడుతాయి. అంతా భావుక భావ్యమానమైన సాహిత్య ప్రపంచ చిత్రణ!

నోరి నరసింహశాస్త్రి గారికి యువతరం రచయితలంటే వల్లమాలిన అభిమానం. వారు ఎందరికో గురుస్థానీయులు. ఎన్నడో 1965లో విహారి & శాలివాహన రాసిన ‘వసంతరాయలు’ చారిత్రక నవల చదివి ఎంతో ఆత్మీయంగా ‘మీరు విస్మృతాంశాన్ని వెలుగుకు తెచ్చి సృజనాత్మక నవల రాశారంటూ ప్రశంసించి, దానిని సాహిత్య అకాడెమీకి సిఫారసు చేస్తున్నట్లు చెప్పారు! రెడ్డిరాజుల్లో కర్పూర వసంతరాయలుగా కుమారగిరి ప్రసిద్ధుడు. తన కావ్యంతో ఆయన్ని సాహిత్యంలో అజరామరం చేశారు డా. సి.నా.రె. అయితే కుమారగిరి చిన్నాయన అనవేమారెడ్డి అంతకుముందే వసంతరాయలుగా పేరు గడించిన వాడు. మా నవల ఆయన గురించి. అదీ విశేషం!

ప్రస్తుతం నోరి వారి కుమారులు ప్రజ్ఞానిధి, విజ్ఞాన శాస్త్రవేత్త, సాహితీ దిగ్గజం శ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు, తండ్రి పేరున ప్రతి సంవత్సరం ఒక సాహితీవేత్తకు ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందజేస్తున్నారు. మాన్యులు చాలామంది దాని స్వీకర్తలు.

నోరి వారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ కార్యవర్గసభ్యులుగా, ఉపాధ్యక్షులుగా, విశిష్ట సభ్యులుగా కూడా గౌరవాస్పదులైనవారు. వారు వృత్తిరీత్యా రేపల్లెలో ప్రముఖ న్యాయవాది. 1900 ఫిబ్రవరి 6వ తేదీ వారి జన్మదినం. 1978 లో పరమపదించారు. సాహితీవేత్తగా వారు అమరులు!!

- విహారి

Tags:    
Advertisement

Similar News