ఏమని పొగడుదునే చెలీ..!

Advertisement
Update:2022-11-26 08:08 IST

ఏమని పొగడుదునే చెలీ..!

ఏమని పొగడుదునే చెలీ

వేనితో నిను పోల్చజాలుదునె ఓహో నెచ్చెలి

సరస లావణ్య రుచిరసింధుజవు

నీవని అందామంటే

లవణరుచిమయము

నా తనువంటూ

జలధి ఘోషించి వెనుకకు మరలే

నీ మోము సొగసు గని చిన్న బుచ్చుకొని

మబ్బుల చాటున దాగిన చంద్రుని

తమరేని వెదకుచూ వెలవెలబోయిన

తారాలోకం వలవలల విని....

నిత్య మధుర నవ వసంతరాగం

నీ పలుకుల వినివిని అబ్బురపడి

కోకిల పంచమస్వరధుని విడిచెను

మావి చిగురులను మెసవుట నిలిపెను

నీ కురులను తురిమిన మల్లెలు జాజులు

నల్లని నీ సిగ నగవుల నింపగ

మధువులు కరువై శుష్కమధుపాళి

తెల్లవోయి తమ ఝాంకృతి మరచెను

హొయలుమీరు నీ అడుగుల మృదుతతి

లలితలలితప్రణయాంకురనవకృతి

చూచిన హంసికలచ్చెరువున చని

లజ్జతోనిలను కనరాకున్నవి

నీ హేలాలాస్యవినూత్న

నాట్యగతి

క్వణత్ శింజాన మంజులలయశ్రుతి

కని విని మయూర గణములు సిగ్గున

శిరసు వంచి నర్తించ మానినవి

।।ఏమని పొగడుదు ।।

ఆచార్య రాణి సదాశివ మూర్తి

Tags:    
Advertisement

Similar News