సకల ప్రజా సముద్ధర్త
సుప్తోద్ధృత జీవశక్తి
మహాశక్తి ప్రజాశక్తి
వొస్తున్నది వొస్తున్నది!
రూక్షోజ్వల రుధిర దీప్తి
క్ష్మానాథుల తలలు తరిగి
కండ కరుగు కూలీలకు
రక్త మోడ్చు రైతులకూ
వొస్తున్నది ప్రజాశక్తి!
గగనంలో వేగుచుక్క
జగమంతా జగచ్ఛక్తి
తమస గర్భ దళనహేతి
బానిసత్వ విచ్ఛేదక
ప్రబల విజయ ప్రజాశక్తి
వొస్తున్నది ప్రజాశక్తి!
ఆకటితో ఆకటితో
అటమటించు జీవులార!
అన్నపూర్ణ స్వర్ణపాత్ర
వొస్తున్నది ప్రజాశక్తి!
బంధీకృత ధనిక శక్తి
పొగగొట్టపు భుగభుగలో
తెలతెలలై వెలవెలలై
పోతున్నది, వొస్తున్నది
మహాశక్తి ప్రజాశక్తి!
కట్టు చాళ్ల తొలకరి
చిలికిన చిన్నెల వన్నెల
చంద్రవంకలై శాంతమూర్తియై
కాంతి దేహియై వొస్తున్నది
మహాశక్తి ప్రజాశక్తి!
అన్నులతో పన్నులతో
స్వేచ్ఛలేక కుళ్లిన
కుమిలిన విరిగిన
సొరిగిన జీవుల కొక
మహాశక్తి వస్తున్నది!
పరప్రాణం బలిగొంటూ
తమ బేరం సాగించే
రాజనీతి సాగబోదు
జగతి గతికి శాంతి నీతి!
మృత్యువు
కోరల పెం(?)
హత్యకు
హారతు లిచ్చే
అగ్నికి
దాహం పెంచే
చీకటి కాటుక
దిద్దిన యుద్ధం
వక్రగామియై
చరిత్ర లన్నిట
తిరిగిన చక్రం
ప్రజా పథానికి
పయనిస్తున్నది
నినదిస్తున్నది
విజయ నినాదం!
ఎగిరే ఎగిరే ఎర్రటి జండా
కరకరలాడే కొడవలి పదునూ
లోహం వంచిన సమ్మెట పెట్టు
వైప్లవ్యపు వైతాళికులై
నినదించెను నిప్పుల గొంతుక!
'జనమయమ్మగు
జగత్తు సర్వం
దేశాలుగ విభజించుట
పాలించుటకేనా?
కాలికి చేతికి
కడియం తగిలించుట
వికసించే సంస్కారానికి
ఉరి కుచ్చుల పోయుట కాదా!
కదలకుండ
మేడలపై నీడలలో
ఆడుకోను
హక్కుండాలీ?
ప్రకృతి
కుసుమించిన సర్వం
ప్రతి వ్యక్తి
సుఖియించను కాదా?
ఎండలలో
కండ కరిగి
వెన్నిరిచిన డొక్క మాడి
మానానికి
గుడ్డలేక
కరువులాగ
కాళ్లు జాచి
శోషిల్లాలి?'
అదృష్టపు
యవనిక లోపల
జరిగే
ఈ విషాద ఘటనల
కంతమ్మే
విప్లవమని
చాటుటకై వొస్తున్నది
ప్రశ్నించిన ప్రజాశక్తి!
ఖైదులలో కోటలలో పేటలలో
బాధామయ హృదయాలలో
పోటెత్తిన ప్రళయ జ్వాల
చావని చావులేని జగజ్వాల
యువ జ్వాల నవ జ్వాల
జ్వలన శీల ప్రజాశక్తి
మహాశక్తి వొస్తున్నది!
మతమునకూ గతమునకూ
మనసులేని మనుషులకూ
కుటిల క్రౌర్య కల్పనకూ
శత్రుచిహ్న జన శక్తి
వొస్తున్నది ప్రజాశక్తి!
ఉరి కొయ్యల స్వతంత్ర గానం
ఆరక రగిలే వీరుల చితులు
హోరుమనే శృంఖల నాదం
అగ్ని గోళమై కాల వ్యాళమై
కనలే కనలే క్షుభితావని
పిలిచిన వలచిన మహాశక్తి
ప్రజాశక్తి వొస్తున్నది!
అరి భయంకర ఆహవ శక్తి
నవ జీవన ప్రభాత భేరీ
అభిగామియై శుభదాయకమై
సౌదామిని నిగనిగలై
ధగధగలై వొస్తున్నది
మహాశక్తి ప్రజాశక్తి!
(జూన్ '1941 )
-ఏల్చూరి సుబ్రహ్మణ్యం