ప్రతి ప్రేమలో పుట్టే
పరిమళంలా
వసంత సుందరి
వగలు వయ్యారాల
మాధుర్యంలో తీపి
మరింత పసందు
వలపుల కులుకుల
కోకిల పిలుపుల పులుపు
పొరిగింటి ఇరుగింటి
కూరల పులుపుల మధ్య జరిగే
గిల్లి కజ్జాల పొగరులో వగరు
మన మనసున మరిగి
మసలి కోపంలా రగిలే
పగలు ప్రతీకారాల కారం
వంటల్లో ఉన్నట్టు లేనట్టు
ఉండాల్సిన రుచి
అది తిన్న వారిలో
విశ్వాసానికి ఉన్న హేతువులా
ఉప్పు
చెడిన చెలిమిని బాధించి
గుండెను పిండే చెడ్డది చేదు
అయినా తీపి రోగాలతో
తినలేని తీపి కన్నా
మేలైనదీ చేదు
షడ్రృచుల సంగమంతో
సంతోషఫలాల సలాడ్ నే
ఉగాది పచ్చడిగ పేరెడదాం
సంవత్సరాది సందర్భంగా
ఆరు రుచులకు తోడుగ
ఏడవ రుచిలా
మంచిని కూడా పంచుదాం
సమాజ శ్రేయస్సుకు
చేతులు కలిపి
సంకల్పాల సందడి చేద్దాం.
-దుద్దుంపూడి అనసూయ
(రాజ మహేంద్రవరం)
Advertisement