జడి వానలకే తడి నేలల్లో
పాముల వల్లో పక్షుల వల్లో
పాపం పడు మొక్కలు
వాటికవే మొలిచేస్తాయి
వాటికెవరూ నీరు పొయ్యరు
వాటికెపుడూ ఎరువెయ్యరు
బాటకెదురొస్తే పీకి పారేస్తారు
మాటకెదిరిస్తే అణిచేస్తారు
అయినా ఏ పక్కనో మిగిలినవి
పునాదే లేని అనాధ జీవనాల్లా
వరమో శాపమో తేల్చుకో లేని
కుంతి మొక్కుల ఫలితాల్లా
వాటికవే పుట్టి పెరిగేస్తాయి
కానీ స్వయంకృషితో ఎదిగి
పంట కొచ్చాక పళ్లు కాస్తుంటే
ప్రతి వారు పరుగెత్తుకొస్తారు
హక్కులకై దత్తత తీసుకుంటారు అచ్చం
ఓ అనాధ అందలమెక్కితే
అందరికి బంధువైపోయినట్టు.
- దుద్దుంపూడి అనసూయ
Advertisement