మౌనంగా చీకట్లో
నమ్మి తపస్సు చేసే
చిన్న విత్తును
మహావృక్షం గా
మార్చగల శక్తి మట్టిది!!
అన్నింటినీ అమ్ముకుంటూ
ఆడంబరంగా బతికే తీరు నచ్చకmm
కృషిని ప్రేమించమనే
మనసు మట్టిది!!
ఋతువుఋతువు కీ
ఆరోగ్యాన్నిచ్చే ఫలాలనిచ్చి
ఆనందాన్నిచ్చే పూలను తెచ్చి..
కంటికింపైన దృశ్యాలతో
కట్టి పడేసి..
యుగయుగాలుగా
కన్నీళ్ళు తుడిచి,
దిగులుపోగొట్టే మనసు మట్టి ది!!
మట్టి లో ఆడుకునే పాపాయి
ఇసుకలో కట్టే పిచ్చికగూళ్ళు
సంబరాల-
అంబరమెక్కించటమే కాదు,
భావి హర్మ్యాల హరివిల్లు ని
పరిచయం చేస్తుంది!
కిలకిలా నవ్వుతూ
కలకలలాడే పిల్లల్ని
రంగులపూలమొక్కలుగా
ఎలా మురిపెంగా పెంచాలో
మట్టి తల్లి
మరీ మరీ చెప్తోంది కదా!?
- డా.వేమూరి.సత్యవతి.
Advertisement