మొదటి బడి (గల్పిక)

Advertisement
Update:2023-08-05 00:01 IST

“అమ్మా!” అరుస్తూ ఎంతో ఉత్సాహంగా లోపలికి పరుగెత్తుకుంటూ వచ్చిన ఆరేళ్ళదయాజలధిని చూడనైనా చూడకుండా

"ఏమిటా అరుపులు? మెల్లగా పిలవాలని యెన్ని సార్లు చెప్పాను?

 అసలా ఉరుకులేంటి? నెమ్మదిగా రాలేవు?” అంటూ సాహిత్య

”లోపలికి వచ్చి, ఆ షూ రాక్ లో షూస్, సాక్స్ వదిలి, పుస్తకాల సంచిని అక్కడ బల్లమీద పెట్టి, కాళ్ళు, చేతులు కడుక్కున్నాక, నా దగ్గరికి రా. ఆ తరువాత మాట్లాడు.” అన్న తల్లిని చూశాక, ఉత్సాహమంతా ఒక్కసారి ఆవిరైపోయింది ఐదేళ్ళ దయాజలధికి.

హుషారంతా పోగా, నీరసం వచ్చింది. ఇంకా మాట్లాడితే చివాట్లు తప్పవనుకుని, మారుమాట్లాడక తల్లి చెప్పినట్లే చేసి, అమ్మదగ్గరికి కాక, లోపల గదిలో తన రాకకై యెదురుచూసే బామ్మ దగ్గరికి వెళ్ళాడు.దగ్గరికి వచ్చిన మనవడిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని,

“యేం నాన్నా! భలే హుషారుగా వచ్చావు. ఈ రోజు బళ్ళో యేమన్నా విశేషమా?” అనడిగింది. “అవును బామ్మా! మా క్రాఫ్ట్ క్లాసులో ఈవేళ నేను కర్చీఫ్ చివర్లు కుట్టాను. అదీ అందరికంటే ముందుగా. అందుకు మా మిస్ నాకు 3 స్టార్స్ ఇచ్చి, “దయాజలధి చాలా చురుకైన అబ్బాయి” అని చప్పట్లు కొట్టింది. నాకెంత సంతోషం కలిగిందో తెలుసా?” అని ఒక్క గుక్కలో చెప్పి, ఆగి, “ ఆ మాట అమ్మకి చెప్పాలని యెంతో ఇదిగా వస్తే, అమ్మ కేకలేసింది. అసలు అమ్మకి నేనంటే ఇష్టం లేదు బామ్మా. నీకే నేనంటే చాలా ప్రేమ.” అంటూ బిక్కముఖమేశాడు.

ఇంతలో అమ్మ యెంతసేపైనా పాలు త్రాగడానికి పిల్లవాడు రాలేదని లోపలి గదిలోంచి మాటలు వినబడడంతో అక్కడికి వచ్చి, గది దగ్గరే ఆగింది అత్తగారి సమాధానం వినాలని. బామ్మ” అమ్మ పనిలో ఉంది కదా! అందుకే అలా అంది. అదీకాక, నీవు వచ్చే ఉత్సాహంలో బయట తిరిగిన షూస్తో యెక్కడ లోపలికి వచ్చి, దుమ్ము చేస్తావోనని అలా అంది. అంతే కానీ నీమీద ఇష్టం లేక కాదు నాన్నా!”అని సమాధానపరచింది మనవడిని.

“మరి నన్నెందుకు యెప్పుడూ అది చెయ్యి,ఇది చెయ్యి, ఇలా చేయకు, అలా చేయకు అని టీచర్ లాగా చెపుతుంది. ఈ ఇల్లు కూడా ఒక బడి లాగా ఉంది నాకు. మన పక్కింటి రామూని వాళ్ళ అమ్మ యెంత ప్రేమగా చూస్తుందో తెలుసా? అలా అమ్మ నన్ను యెందుకు ప్రేమగా చూడదు బామ్మా? నేనేదో పెద్ద పిల్లవాడినైనట్లు నాతో దూరంగా నిలుచునే మాట్లాడుతుంది. నన్ను ఒక్కసారైనా దగ్గరికి తీసుకోదు. మంచి మార్కులు తెచ్చుకున్నా, చెప్పిన పనులు చేసినా నన్ను మెచ్చుకోదు. ముద్దుచేయదు.  అసలు నాతో కాస్సేపు కూడా కూర్చుని నీలాగా కథలు చెప్పదు.  బళ్ళో జరిగిన విషయాలు అడగదు. ఎప్పుడు మాట్లాడినా అది హోంవర్కు, మార్కుల గురించి మాత్రమే మాట్లాడుతుంది. నేనేమన్నా బొమ్మనా బామ్మా? నా స్నేహితులు తమ తల్లులతో వారు మాట్లాడే విషయాలన్నీ చెబితే, నాకు యెంత బాధ కలుగుతుందో. అందుకే అన్నాను అమ్మకి నేనంటే అసలు ఇష్టం లేదని” అంటూ బామ్మని కావలించుకుని యేడ్చేశాడు దయాజలధి.

వాడి బుగ్గలమీద కారుతున్న కన్నీటిని తన కొంగుతో తుడుస్తూ. “నీవంటే అమ్మకి చాలా ఇష్టం కాబట్టే దూరంగా ఉన్న మంచి బళ్ళో చేర్పించింది ఫీజులెక్కువైనా. అంతే కాక నీకు మంచి మంచి ఆటబొమ్మలు, పుస్తకాలు వెతికి వెతికి మరీ కొనిపెట్టింది. నీవు మంచిపిల్లవాడిలా పెరగాలనేగా శుభ్రంగా ఉండమంటోంది. అసలు ఇల్లేరా పిల్లలకి మొదటిబడి, అమ్మే మొదటి గురువు. నీమీద ప్రేమ లేకపోతే ఇవన్నీ చేస్తుందా?” అంటూ అనునయంగా చెప్పి, “వెళ్ళి  ముఖం కడుక్కుని రా, పాలు తాగుదువుగాని.” అంటూ బయటికి వచ్చింది.

ఆమె బయటికి వచ్చేలోపు సాహిత్య వంటింట్లోకి వెళ్ళింది.

మనవడి మనస్సు బాగా గాయపడిందని అర్థం చేసుకున్న బామ్మ కోడలిని పిలిచింది. “వస్తున్నానత్తయ్యా!” అంటూ కలిపిన పాలగ్లాసుని అత్తగారి చేతిలో పెట్టింది సాహిత్య  “మీ అల్లారుముద్దు మనవడికి మీరే తాగించండి” అని నవ్వుతూ.

“చూడమ్మా! ఎంత నేను ముద్దుచేసినా వాడు నీనుంచే ప్రేమానురాగాలని యెదురుచూస్తాడు. నీవు కాస్త వాడిని నీకు చేరువ అయ్యేలా చేసుకో. నీకు వాడిమీద చాలా ప్రేముందని నాకు తెలుసు. కానీ యెప్పుడూ వాడిని క్రమశిక్షణ అంటూ చేసే కట్టడి వాడిని నీకు మానసికంగా, శారీరకంగా దూరం చేస్తుందన్నది తెలుసుకో. శుచీ, శుభ్రత ముఖ్యమే. మొక్కై వంగనిది మానై వంగదని, అన్ని మంచి విషయాలు మనం పిల్లలకి చిన్నపుడే నేర్పడం మంచిదే. కానీ  బళ్ళోంచి ఇంటికి రాగానే  నిన్ను చూసినపుడు వాడి ముఖం యెలా వెలిగిపోతుందో కాస్త పరిశీలించి చూస్తే, నీకు అర్థమవుతుంది. నీవు మొదట వాడిని దగ్గరికి తీసుకుని, మెత్తగా శుభ్రత గురించి చెబితే, వాడే అర్థం చేసుకుంటాడు.  అన్నీ వాటి వాటి స్థానాలలో పెట్టి, కాళ్ళూ, చేతులూ కడుకున్న తర్వాతే నీ దగ్గరికి వస్తాడు. అలా కాకపోతే, నీమీద అనవసరంగా అనిష్టాన్ని పెంచుకుంటాడు. తెలిసిందా? కనుక పిల్లవాడికి నీవే వెళ్ళి, కాస్సేపు బుజ్జగించి,పాలు తాగించు.  పిల్లలకు మనం ఇచ్చే అపురూపమైన బహుమతి సమయం. కొంత సమయం వారితో గడిపితే, వారు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, తృప్తిగా ఉంటారు. తమకు తమ తలిదండ్రుల అండ ఉందన్న భరోసాతో, ఆత్మస్థైర్యంతో ఉంటారు.

తెలిసిందా?” మెత్తగానే కానీ ఘాటుగా మనసుకి హత్తుకుపోయేలాగా తన తప్పుని తెలియచెప్పిన అత్తగారి ఔదార్యానికి, సమయస్ఫూర్తికి సాహిత్య నయనాలు అశ్రుపూరితాలయ్యాయి కృతజ్ఞతతో.

సరే నంటూ నవ్వుముఖంతో కొడుకు దగ్గరికి వెళ్ళింది  ఒక టీచర్ గా కాక మూర్తీభవించిన ఒక మాతృమూర్తిగా.

- డా. తిరుమల ఆముక్తమాల్యద

Tags:    
Advertisement

Similar News