టీపాయ్ (కవిత)

Advertisement
Update:2023-04-02 17:02 IST

ఇవాళెందుకో

టీపాయి అలిగింది.

చాచిన చేతులు వెనక్కి తీసుకునే

పాపాయిలా వుంది.

నాలుగు రోజులుగా

ఊళ్లో లేనని కాబోలు

ఇల్లు చేరగానే

ఎడమొగం పెడమొగం పెట్టింది.

జన్నారం అడవిలో దొరికిన

అపురూపమైన దారు శకలమిది.

దాని కడుపులో దాగిన

పక్షుల కల కూజితాలు

నా కవిత్వంలోకి

సరఫరా అవుతుంటాయి.

దాని వొంటి మీద తేలిన

జాయల డిజైన్లు

వడ్రంగి పట్టిన చిత్రికలోంచి బైట పడ్డాయి.

అప్పుడది

అజ్ఞాత చిత్ర కారిణిలా

ఆశ్చర్యానికి గురి చేసింది.

అన్నట్టు ఆ డిజైన్లలో

అల్లుకపోయిన జీవన మార్గాల్లో

సంక్లిష్ట సౌందర్యాన్ని దర్శిస్తాను.

విస్తీర్ణంలో చిన్నదే కావచ్చు

కాని ఇంటి అరుగు మీద

మహాభారతాన్ని తిలకించినట్టు

ప్రతిరోజూ

ఒక జీవనాటకాని కిది వేదికౌతుంది.

టీపాయి కిటు వైపు నేను

అటు వైపు అతిథులు.

కొందరిని చూస్తే

దానికెందుకో అమిత ప్రీతి.

ఒకాయన నిర్లక్ష్యంగా కాలు తగిలిస్తే

మళ్లీ ఆయన ముఖం చూడలేదు.

కాఫీ చుక్కలు పడితే

తుడిచి శుభ్రం చేసే దాకా స్థిమిత పడదు.

మా ఆవిడ కార్చిన

ఆనాటి కన్నీళ్ల జోలికి మాత్రం

రానిచ్చేది కాదు.

టీపాయి

ఊహ తెలియంగల శ్రోత.

కాళిదాసు శాకుంతలాన్ని

ప్రకాశ పఠనం గావిస్తే

దీని అణువణువులో

ఏదో తేజస్సు పాకుతున్న స్ఫురణ.

కదలని సోఫాల్లో ఏముంది

భ్రామిక సుఖం తప్ప.

శ్రామిక జీవనం లోని

సుందర చలన చాలనం మాత్రం టీపాయిదే.

మిత్రులారా!

నాకిది వొట్టి టీపాయి కాదు

దైనందిన చర్యలను

ప్రతిఫలించే కనుదోయి.

ఇంటి లోపలి కేతెంచిన

కలల వాకిలి.

ఎట్ట ఎదుట పరుచుకున్న

జ్వలిత జాబిలి.

- డా౹౹ ఎన్. గోపి

Tags:    
Advertisement

Similar News