సంగమం (కవిత)

Advertisement
Update:2023-08-09 22:09 IST

గతంలో ఆగిపోయే ప్రశ్నే లేదు

నాలోనే దానికి ఎల్లప్పుడూ బస

నిన్నటి చెట్టే అది

వీచే గాలి మాత్రం ఇవాళటిదే.

మొన్నటి పాట అని

కొట్టి పారెయ్యొద్దు

వర్తమాన హృదయ తంత్రులు

కదులుతున్నాయి గమనించు.

ఎండిన కట్టే కావచ్చు

కాని దానికి చుట్టుకున్న భావలతకు

భవిష్య పుష్పాలు పూస్తాయి.

వెతలు నిరంతరం

తరాలను దాటి పరిమళిస్తాయి.

మూడు కాలాల ప్రవాహం

చీల్చుకొని పురోగమిస్తుంది.

కాలువలో అగ్గిపుల్ల కొట్టు కొస్తున్నప్పుడు

దాని స్మృతి జ్వాలలను

దర్శించడమే మన పని.

నదులు ప్రాచీనమే కావచ్చు

కాని అలలకు మనం కొత్త.

స్వర్గారోహణమంటే

పర్వతా లెక్కి దిగటమే

అక్కడి మెట్లకు

మన అడుగులు కొత్త.

రేపటి వైపే మనసు

ఎందుకు లాగుతుంది!

దిగంతాలూ దిశాంతాల వైపే

మన గమ్యాకాంక్ష.

మార్పు నిట్టూర్పు కాదు

నిన్నటి దూరాల చేర్పు

కల్లంలో రాశి పడిన

ధాన్యం గింజల ఊర్పు.

దూరంగా ఎర్రటి బింబం

గుండ్రంగా తిరుగుతుంది చూడు!

దాని భ్రమణం ముందుకే

ఈ మీమాంస అంతా అందుకే.

-- డా౹౹ ఎన్. గోపి

Tags:    
Advertisement

Similar News