రైలు
స్టేషన్‌లోకి ప్రవేశించగానే
ప్లాట్‌ఫారం
వెనక్కి పరిగెడుతున్న భ్రమ
బాల్యంలోనే కాదు
ఇప్పటికీ అదే థ్రిల్లు.
రెండు బండ్లు
పక్క పక్కన నిలిస్తే కూడా
ఏది కదుల్తుందో
పోల్చుకోలేనంత సరదా.
రైల్వే స్టేషన్
క్షణ క్షణికంగా లోకోమోటివ్ వ్యాప్తి
లోహ శాబ్దిక సర్వస్వ శక్తి.
విమానాల దేముంది
ఎగిరితే ఆకాశ శూన్యం
రైలు జగత్తు యావత్తు
సంక్లిష్ట సౌందర్య ధన్యం, అనన్యం.
గంట ముందే
స్టేషన్‌కు వెళ్తాన్నేను
ప్లాట్‌ఫారాన్ని
తీరిగ్గా అధ్యయనం చెయ్యొచ్చు
దానిలోని జన జీవనాన్ని దర్శించొచ్చు.
నా మట్టుకు
లష్కర్‌లోని అందమైన భవనాలన్నీ
సికిందరాబాద్ స్టేషన్ ముందు బలాదూరు
భారత పల్లె లన్నింటినీ
ఒక్క చోట కుప్ప వోసిన అపురూప వేదిక.
ఎదుటి ప్లాట్‌ఫారం మీదికి
ఎగిరి గంతెయ్యాలనిపిస్తుంది.
కాని మెట్లెక్కి బ్రిడ్జి పై నుంచి వెళ్తేనే
అదో ఆనందం
అక్కడి నుంచి చూస్తే కంపార్టుమెంట్లు
ముడిచిన కొప్పుల
ముద్దరాండ్లలా కనిపిస్తాయి.
దూరంగా రైలు
మెడ బైట పెట్టిన సర్పం లాగ
మెల్లగా మలుపు తిరుగుతుంటే
అదో ఆశానిరాశల అరుదైన దృశ్యం!
చెన్నై బండి అనుకుంటే
ముంబై కూడా కావొచ్చు.
ఆగిన ట్రెయిన్‌లో
కిటికీల వద్ద
అభిజ్ఞాన శాకుంతలం లోని
నాలుగో అంకం లాగ
ఆర్ద్రంగా వుంటుంది.
బయట నిల్చున్న ప్రతి వృద్ధుడూ
ఒక కణ్వ మహర్షి లాగ కన్నీళ్లు పెట్టు కుంటాడు.
విదేశాల్లో చూశాను గాని
ఇండియాలోని జన వైవిధ్యం
ఒక జీవన్నాటక తాత్విక పద్యం
అక్కడి స్టేషన్లు
ఇస్త్రీ చేసిన తళ తళలైతే
ఇక్కడివి అనర్ఘమైన మ్యూజియం సంపత్తులు.
రైలు కదిలింది
ఇంతకు ముందటి కుస్తీలు
దోస్తీలుగా మారాయి
అయితే కార్నర్ సీటు
దొరికిన వాడి పట్ల
అసూయ కాస్త మిగిలే వుంటుంది.
ఇప్పుడు వినండి
రైలు
పట్టాలు మారే సంశ్లిష్ట శబ్దం
కొరుకుడు పడని ద్వ్యర్థి కావ్యం
క్రమంగా
గమ్య స్థానంలోని బంధు గణం గుర్తు కొస్తుంటారు.
ఎవరో డబ్బ డబ్బా వెతుకుతున్నారు
మన కోసమే కావచ్చు
రైలు
సుదీర్ఘమైన నిట్టూర్పులా సాగిపోతోంది.
అరె భాయ్!
రైలు నాస్టాల్జియా
కాదు
ఎప్పటికీ నయా నయా!
- డా౹౹ ఎన్. గోపి