ఆకు

Advertisement
Update:2023-09-19 16:15 IST

ఆ చెట్టు

బహుళ పత్ర హరిత మనోహరం.

అట్లా నాకు పరిచయ మయ్యింది

ఒక ఆకు.

దానిపై రాలిన చినుకు

మెరిసే ముత్యాల తళుకు.

లయాత్మకంగా కదులుతూ

గాలిని సంతోష పెట్టే వీవన.

రెపరెపలాడుతూ

పక్షి రెక్కలను ఉత్సాహ పరిచే దీవెన.

ప్రతి రోజూ నన్ను చూడగానే

నిగనిగలాడుతూ

ప్రేమగా నవ్వుతుంది.

దాని అరచేతిపై ఈనెలను

ఎవరో బీజాక్షరాలుగా చెక్కినట్టుంది.

బహుశా అందుకే

దానికీ నా కవిత్వానికీ

మధురానుబంధ మేర్పడింది.

పువ్వులంటే

అసూయ లేదు దానికి

పైగా వాటి వైపు

ముచ్చటగా చూస్తుంది.

దాని త్యౌగిక మూల్యమే

తరు జన్మకు సాఫల్యం.

రాలిపోతాననే

భయమే లేదు

రాలటం

మళ్లీ రావటానికే అంటూ

తాత్విక పాఠాలు వల్లిస్తుంది.

రోజూ మనస్సును

వేర్ల దాకా పంపించి

భావ ప్రసారాలు గావిస్తుంది.

చెట్టుకు రుణపడ్డది తక్కువే

ఇచ్చేదే ఎక్కువ.

వాయువును ఊపిరిగా మార్చినప్పుడు

ప్రాణమే దాని గాన మౌతుంది.

కాలం ఒక కనపడని తుఫాను

దాని ముందు

మొక్కైనా వృక్షమైనా

ఒక్కటే అని ప్రవచిస్తుంది.

జీవన చక్రానికి

మృత్యువును

అనివార్య హేతువుగా భావిస్తుంది.

రాలి పడుతున్నప్పుడు

మిగతా ఆకులు

కాస్త ఆందోళన చెందాయి గాని

అది మాత్రం

తల్లి గారింటికి వెళ్తున్నంత

ఉల్లాసంగా కనిపించింది.

భూమిలో కలిసిన ఆకు

వేర్లతో కబుర్లకు దిగింది.

కొన్నాళ్లు గడిచాయి

మరో ప్రారంభానికి నాంది పడింది.

కొత్తగా మొలిచిన ఆకును చూసి

తతిమ్మా ఆకులన్నీ

కరతాళ ధ్వనులు చేశాయి.

-- డా౹౹ ఎన్. గోపి

Tags:    
Advertisement

Similar News