జన్మ సాఫల్యo (కవిత)

Advertisement
Update:2023-12-03 19:20 IST

పెళ్లిళ్లకో పేరంటాలకో ధరించే

పట్టుచీరల జట్టులో చేరి

ఇస్త్రీ ముడుతల్లోపల ఇరుక్కుపోయి

ఊపిరాడక

ఉక్కిరిబిక్కిరి అయ్యే కంటే.....

పనిలో జీవనవనిలో

పగలూ రేయి శ్రమించే

పల్లె పడుచు

పైట చెంగు రెపరెపలో

నుదుటి చెమట తుడిచి

మురిసి తరించాలని.......

ఓ దారంపోగు

భుక్తాయాసం నిక్కి చూసేలా

బలవంతంగా నింపిన గిన్నెల

పండుగ నాటిపరమాన్నంలో

జీడిపప్పు ద్రాక్షలతో కులికే కంటే....

నకనకలాడే ఆకలి కడుపులు

ఆవురావురని మింగుతు ఉంటే

పచ్చడి మెతుకుల పంచన చేర

తృప్తిగా త్రేన్చిన ఆ కళ్ళకు

నైవేద్యంగా మారాలని ...

ఓ బియ్యం గింజ

వత్సరానికోసారి

ఒంటిమీద తిరణాల

మిగతా బ్రతుకంతా

గాలిచొరని చెరసాల

క్షణం పాటు మిరుమిట్లు ,

అంతులేని చీకట్లు

కఠినమైన వజ్రంలా

కలకాలం నిలిచే కంటే

కారు నలుపు రూపైన

కట్టెలతో కలిసున్నా

పేదవాని పెన్నిధిగా

ప్రతిదినమూ ప్రజ్వలించి

అనుక్షణం మంటలతో

అణువణువూ రగిలిపోయి

వంట ఇంటి యజ్ఞంలో

ఒక సమిధై పోవాలని .....

ఓ బొగ్గు ముక్క

విలాసాల విందులలో

వినోదాల విహారంలో

విరుచుకుపడి తెరుచుకునే

విస్కీ సీసాలు

గాజుల చేతులు అందించే '

గాజు'గ్లాసు గలగలలో

చల్లదనం కోసం కలిపే మంచు ముక్కనయ్య కంటే

నడినెత్తిని మండించే

మధ్యాహ్నపు టెండలోన

నడువలేక నడువలేక

అడుగులోన అడుగిడుతూ

దరిదాపుల దప్పి తీరు

దారితెన్ను కానలేక

దాహంతో అలమటించు

బాటసారి తృప్తి తీర

ఎంచక్కా చిరు చుక్కై గొంతు తడిపి చూడాలని......

ఓ నీటి చుక్క

విన్నవించుకున్నాయి

నన్ను గెలుచుకున్నాయి

మనసున్న మనిషిగా

నన్ను మార్చి వేశాయి

మానవత్వపు విలువలు

మరీ మరీ తెలిపాయి

నిగూఢ రహస్యము,

వేదాంత సారాంశము

జన్మ సాఫల్యమే జన్మ రాహిత్యం

- డా.గెలివి సహదేవుడు

( నంద్యాల)

Tags:    
Advertisement

Similar News