"ప్రపంచం అంతా నీలాగే ఆలోచిస్తుందా? అలా ఆలోచిస్తే ఏవీ జరిగి ఉండేవికావు. సమస్య అంటే ఏమిటో నీకు సరైన అవగాహన లేదన్నది నాకర్ధమైంది. ఇప్పటికైనా నీ ధోరణి మార్చుకో. లేని సమస్యలను సృష్టించుకోకు"
అంటూ చిన్న ఉపన్యాసమే ఇవ్వాల్సివచ్చింది సృజన కి.
అంతా శ్రద్ధగానే విన్నట్టుంది. ఏమనుకుందో ......
"సరే సింధు..నీమాట వింటాను. జరిగింది మర్చిపోవటానికే ప్రయత్నిస్తాను. నువ్వన్నదానిలోనూ నిజం లేకపోలేదు. ఆలోచిస్తే నాదేమంత సమస్య కాదు. కానీ మనసనేది ఊరుకోదు. చిన్నపిల్లలా మారాం చేస్తుంది. అందుకే అలా బరస్ట్ అయాను. ఫ్రస్టేషన్ కి దూరమౌతాను. అలా బయటకు వెళ్ళి తిరిగివద్దాం"
అన్న సింధు సమాధానానికి ఎంతో ఆనందం కలిగింది.
ఇంట్లో పెద్దగా గొడవేం జరగ లేదు. కానీ బేల మనస్తత్వం సింధుది. దాదాపు పదేళ్ళ స్నేహం తనతో. తను అర్ధం చేసుకున్నట్టు ఇంట్లో వాళ్ళు కూడా తనని అర్ధం చేసుకోలేదు. ఉమ్మడి కుటుంబం పిల్లలూ పెద్దలూ నా అనే అందరూ ఉన్నా ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకున్న నిర్ణయం తప్పు అని చెప్పాను. ప్రపంచంలో సమస్యలు లేనివాళ్ళంటూ లేరని ఒక్కొక్కరికి ఒక్కోరకమైన సమస్యని...అసలు కొన్ని సమస్యలముందు నీది సమస్యే కాదని. పరిష్కారం లేని సమస్య ఉండదని,సమస్యలని భూతద్దంలో చూడకూడదని చెప్పేసరికి కొంచెం దారిలో పడింది సింధు.
***
"రియాజ్ మన పెళ్ళి గురించి మర్చిపో. నాకున్న సమస్యలు నాకున్నాయి. నిన్నేమీ బలవంతం చేయను. నీ ప్రేమ జీవితాంతం గుర్తుండిపోతుంది. నీ అవకాశాలని జారవిడుచుకోకు. అత్యవసర పరిస్థితి దేశ రక్షణ బాధ్యత ఈ రెండిటికీ నేనూ గౌరవం ఇస్తాను. టెన్షన్ పడకు. నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను"
అంటున్న నూరీ మాటలకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియక ఆమె అరచేతుల్లో మొహం పెట్టి చిన్నపిల్లాడిలా బావురుమంటున్న రియాజ్ ను
"చూడు..రియాజ్.. బీ బ్రేవ్"
లాలించింది నూరీ.
రియాజ్ తో పెళ్ళి మాటలుకూడా అయాయి. ఇంతలోనే అనూహ్యంగా అధికారులనుంచి పిలుపు రావటం తో వదిలి వెళ్ళక తప్పటంలేదు
**
"అసలు నీ సమస్యేంటి? రాత్రికి రాత్రి నీకు పేరు ప్రఖ్యాతులు ఎలా వస్తాయనుకుంటున్నావ్? అయినా నిన్ను ఎవరితోనూ సరిపోల్చుకోవద్దని లక్షసార్లు చెప్పాను. ఎవరి కృషి వారిది. ఎవరి ప్రయత్నం వారిది. ఒక్కోసారి మనం ఊహించనివి కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. సమయం కోసం వేచి చూడాలి.
సహనం,సంయమనం మనిషిని సరైన దారిలో నడిపిస్తాయి. అనవసరమైన ఆలోచనలు మాని నీ లక్ష్యం వైపు నీ ప్రయత్నాలు కొనసాగించు. మనిషి కోరికలకు అంతుండదు. అన్నిటినీ తృప్తిపరచాలనుకోవటం అవివేకం. నీకంటూ ఒకరోజు వస్తుంది"
అని తనకి బోధచేస్తున్న విక్రం సర్ మాటలనే శ్రద్ధగా విన్నాడు ప్రమోద్.
"అర్ధమైంది సర్. నేనెవరిమీదా కోపం,ఈర్ష్యా పెంచుకోను. మీ మాట నాకు వేదవాక్కు. క్రిష్ కే కెప్టేన్సీ ఇచ్చేయండి.మేం ఫ్రెండ్లీగా ఉంటాం"
అన్నాడు ప్రమోద్.
****
సింధు ఐ.ఎ.ఎస్ టాపర్ పేపర్లో చూసి మురిసిపోయింది
సృజన. ఆ రోజు సమస్యలకు భయపడిన సింధు ఈ సింధు ఒకరేనా..అని ఆశ్చర్యపోయింది.
రియాజ్ కి కీర్తిపతకం లభించింది. నూరీ గుండె సన్నగా మూల్గింది. యుద్ధం లో శౌర్యం ప్రదర్శించి శత్రువులకు సింహస్వప్పమై వాళ్ళని మట్టికరిపించి ప్రాణాలు అర్పించిన రియాజ్ అమరుడు. దేశం కోసం తనని తాను సమర్పించుకోవటం గ్రేట్ అనుకుంది నూరీ.
ప్రమోద్ కి కెప్టేన్సీ మూడేళ్ళ తరవాత వచ్చింది. ఆటలలో తన ప్రతిభ చూపించి,తన ఆవేశానికి అడ్డకట్టవేసి ప్రపంచంలోనే గొప్ప పేరు తెచ్చుకొనేలా తనని ప్రోత్సహించిన విక్రం సార్ కి ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు ప్రమోద్.
***
ఒకొక్కరికి ఒక్కోసమస్య. అన్నీపరిష్కరింపబడతాయి...కాస్త ముందూ వెనక. సమస్యలు భయపెడతాయి. అర్ధం చేసుకుంటే అవే వెనక్కి మరలివెళతాయి.
డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి
(అనకాపల్లి)