ఆకాశంలో వెలుగులు పరుచుకోకముందే
బండెడు ఆశల ఊసులు సైకిల్ కికట్టుకొని
రోడ్లపై వెలుగుపంచే సూరీడవుతాడు.
రివ్వురివ్వున సాగాలనుకున్నా
ఆగి ఆగి వెళ్ళే పని తనది.
చదూకున్నాడో చదువుతున్నాడో తెలీదుగానీ
చదువరులకోసమే నిత్యప్రభాత సంచారం
శాస్త్రాలు,న్యూటన్ తెలుసోతెలీదోకానీ
సూత్రం ఆధారంగానే పేపరుచుట్టచుట్టి
ఒడుపుగా ముంగిట్లో పడేలా గిరాటేస్తాడు
కబుర్లకాలక్షేపం తనకు కుదరదుగానీ
ప్రపంచం కబుర్లన్నీ సమయానికందేలాచేస్తాడు
నిరుద్యోగ జీవికి చిరుదీపమైన
న్యూస్ పేపర్ పంపకమే జీవికగా
తనసమయాన్ని కొంత కేటాయిస్తాడు
ఎండా,వానా ,చలీ అన్నీతనవే
అయినా లక్ష్యంముందెపుడూ అలిసిపోడు
అపార్టుమెంట్లైనా,గేటెడ్ కమ్యూనిటీలైనా
ఉత్సాహంగా ఇంటింటా పేపర్ పంచేపనిలో
పత్రికాధినేతలకూ పాఠకులకూ సంధానకర్తగా,కర్తవ్యపాలకుడుగా అనునిత్యం
ప్రభాత సేవకుడై తృప్తితో సాగిపోతాడు
-డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి
(అనకాపల్లి, విశాఖజిల్లా )