ఎవరు మెచ్చు కుంటారని
ఆకాశం వర్షిస్తున్నది..
చినుకులతో దేహాన్ని
చల్లబరుచుకున్న నేల
పచ్చని మొలకలకు జన్మ నిస్తున్నది
మనిషి ఆకలిని తీర్చే
బువ్వ గింజలని ఇస్తున్నది
ఎవరు అడిగారాని వృక్షాలు
పూలు, పండ్లని ఇస్తున్నాయి
సూర్యుడు వెలుగు కిరణాలని,
చంద్రుడు వెన్నెలని
ఎందుకు కురిపిస్తున్నారు...
అడగకుండానే అన్నీ ఇచ్చే ప్రకృతి
నేడు అలమటిస్తున్నది
కాలుష్యంతో కరిగిపోతూ
మనిషీ !
ఇప్పటికైనా కళ్ళు తెరువు
శబ్ద కాలుష్యంలో ,
వాయు కాలుష్యంలో
మునిగిపోయి
అంతర్జాల కాలుష్యంతో
అశ్లేలతలో నిన్ను నువ్వు
కోల్పోతున్నావు.
స్విగ్గీలు, జోమాటోలతో
ఆకలి తీర్చుకుంటూ
అరిటాకులో భోజనం మర్చిపోతున్నావు
ఒకసారి జీవితాన్ని
అద్దంలో చూసుకుంటే
అన్నీ అపరాధాలే కనిపిస్తాయి
మనిషి మనుగడకు ఊపిరులూదే
గాలినీ నీటినీ భూమినీ విషంతో నింపుతున్నాము
రేపటి తరానికి ఏమీ మిగల్చక
కృత్రిమ ప్రపంచాన్ని అందించే వైపు అడుగు లేస్తున్నాం
ఈ నిర్లక్ష్యానికి
మూల్యం చెల్లించక తప్పదు
రేపటి ప్రశ్నలకు జవాబులు
వెతుక్కోకా తప్పదు...
- డా. పాతూరి అన్నపూర్ణ