దిష్టి (కథ)

Advertisement
Update:2023-09-22 10:34 IST

"రెడీనా?నేను స్కూటర్ తీస్తున్నాను మరి" అన్నాను.

ఆ సాయంత్రం గుడికి వెదడామనుకొన్నాం. శ్రీమతి తయారవుతోంది "మబ్బులు పట్టాయి. వర్షం వచ్చేటట్లు ఉంది" హెచ్చరించాను. ఆడవాళ్లు అలంకార ప్రియులు.వాళ్ళ అలంకారాల మీద తీసుకునే సమయం మీద ఎవరైనా హాస్యోక్తులు వేస్తే బాగానే ఉంటుంది.. కానీ ఈమధ్య ఓ పెద్దాయన ఏకంగా "ఎవరిని ఆకర్షించుకోవాలని తెగ మేకప్ అవుతారో" అంటూ చలోక్తుల "గీత" దాటి వ్యాఖ్యానించి విమర్శలకు గురైన విషయం మదిలో మెదిలింది.

"ఇదిగో వచ్చేస్తున్నా" అంటూ హడావుడిగా వచ్చింది శ్రీమతి ఇంటికి తాళం వేసి. " వెళ్లేది గుడికే కదా" అన్నాను స్కూటర్ తీస్తూ .."అయితే మాత్రం పొద్దుట నుంచి ఒకటే పని చాలా అలసటగా ఉంది ఈ జిడ్డు మొహంతో బయటకు ఎలా రాగలను?" అన్నది వెనుక కూర్చుంటూ .అసలు నేను మేకప్ గురించి ఏమీ అనక పోయినా.. ఇంకా నా మాటలు అయిపోయినట్లే .తను మొదలుపెడుతుంది. స్కూటర్ ముందుకు పోనిచ్చాను.

టప్ మని ఒక చినుకు పడింది "తొందరగా పోనివ్వండి వర్షం పెద్దదైతే తడిసిపోతాం ఇదేమయినా కారా...అని కారుకి దీర్ఘం ఇచ్చి " అన్నట్లు చెప్పడం మరిచా .సరోజా వాళ్ళు "ఆల్టో" మార్చేసి "ఐ టెన్" తీసుకుంటున్నారు మనం కనీసం స్కూటర్ కూడా మార్చలేదు పదేళ్ల బట్టి ఈ డొక్కు స్కూటరే" ఆమె ప్రవాహం మొదలు ..

సరోజ తనకి తోడికోడలు వరుస వాళ్ళు పదేళ్ల నాడు తొలిసారిగా వాళ్ళు కారు కొంటున్నప్పుడు నా మోపేడ్ అమ్మేసి వాళ్ల దగ్గరే వాళ్ళ స్కూటర్ సెకండ్ హ్యాండ్ కి తీసుకొన్నాను. తను చాలా తక్కువ ధరకు తన కొత్త స్కూటర్ ఇచ్చేసాడు .ఇప్పటివరకు రెండు కార్లు మార్చేడు ఇది మూడోది. తనకి "వెనకాలా" ఉంది "బయటా" దొరుకుతుంది మరి. మా ఇంటికి వచ్చినప్పుడల్లా " ఇంకా ఈ స్కూటరే వాడుతున్నారా" అని వాళ్ళు అనకపోయినా వాళ్ళు అన్నట్లే ఫీల్ అయ్యేది నా శ్రీమతి. ఇప్పుడు ఆ కొత్త కారు కి పూజ చేయించుకోవడానికి గుడికి వస్తున్నారు. మమ్మల్నీ రమ్మన్నారు.

అట్నుంచి ఎటైనా వెళ్లి డిన్నర్ చేద్దాం అన్నాడు రమేష్ -సరోజ భర్త. అదీ విషయం. మేమిద్దరం బాగానే ఉంటాం. ఆడవాళ్లు స్నేహంగానే ఉంటారు.. కానీ మధ్యలో చాలా" కానీ" లు ఉన్నాయి.

మరి నాలుగు చినుకులు పడ్డాయి నేను ఎక్కడైనా ఆగాలా అనుకునేంతలో తగ్గాయి . కానీ శ్రీమతి సనుగుడు ఆగలేదు షరా మామూలే ..పోలికలు కొంపముంచే పోలికలు. నేను అంచలంచెలుగా ఎదుగుతున్నాను.. సైకిల్ .... మోపెడ్...స్కూటర్ .. ఎదుగుదల కాదా? అద్దె ఇంటి లోంచి సొంత డబుల్ బెడ్ రూమ్ ప్లాటు కి మారాం. తను ఫ్లాట్ నుంచి విల్లాకి మారేడు.కార్లు మారుస్తూన్నాడు.. ఎవరి పరిధి వారిది. ఎవరి అదృష్టం వారిది.మన పరిధిలో మనం ఎదుగుతున్నామా లేదా అనేది మాత్రమే చూడాలంటాను

నేను సంతృప్తితోనే ఉన్నా. పిల్లల కాలేజీ చదువులు అయ్యాయి .అమ్మాయి అబ్బాయి ఉద్యోగాలలో చేరారు. అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాము .పెళ్లి అయ్యాక బ్యాలెన్స్ షీట్ చూసుకొని నేను కారు కొనే ఉద్దేశంలోనే ఉన్నాను. ఆ విషయం తనకి చెప్పాను తనకీ మావీ,, వాళ్ళవీ స్థితిగతులు తెలుసు .కానీ సరోజ లాంటి వాళ్ళు కలిసినప్పుడు ఇంతే.

గుడికి చేరుకున్నాము. అప్పటికే రమేష్ సరోజ లు వచ్చేసారు .సరికొత్త మోడల్ " ఐ టెన్" కారు కొత్త కలర్ లో మెరిసిపోతోంది. పూజ పూర్తయింది రమేష్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. సరోజ శ్రీమతికి కారుని పరిచయం ప్రతి ఫీచర్ ని వివరిస్తోంది.

నేను ఓ వారగా మెట్ల మీద కూర్చున్నాను.కాస్త ఖాళీ దొరికితే చాలు ఆలోచనల లోకి జారుకోవడం , ప్రతి విషయాన్నీ పరిశీలించటం విశ్లేషణ చేయటం నాకు అలవాటు.నాకు ఆ గుడి పరిసరాలు బాగా పరిచయం.. తరచూ వస్తుంటాను. గుడి కొండ మీద కాదు గాని కొంత ఎత్తు మీదఉంటుంది .క్రిందకి ఓ పది మెట్లు దిగాక పెద్ద చదునైన ప్రదేశం వస్తుంది. అక్కడ నుంచి పక్కకు తిరిగి మరో ఐదు ఆరు మెట్లు దిగాక మెయిన్ రోడ్డు కి దారి వస్తుంది. పైన చదునైన ప్రదేశం లోఓ ఐదారుగురు బిచ్చగాళ్లు ఉంటారు. కిందకు దిగగానే మరో నలుగురు ఉంటారు. కొద్దిగా దూరంగా మెయిన్ రోడ్ ఆర్చ్ దగ్గర మరి కొంతమంది ఉంటారు. ఎప్పుడూ వస్తూ ఉండటంతో వాళ్ల మొహాలు కూడా నాకు పరిచయమే. పైన చదునైన ప్రదేశంలో ఎప్పుడూ ఉండే బిచ్చగాళ్లే ఉంటారు.

""పాట పాడు కొన్నట్లు"" కొత్త బిచ్చగాళ్లనెవరినీ రానీరు. క్రిందన, ఆర్చ్ దగ్గర వాళ్లు మారుతూ ఉంటారు.. యధాలాపం గా చూస్తున్న నన్ను ఓ దృశ్యం ఆకర్షించింది చదునైన ప్రదేశంలో కూర్చున్న బిచ్చగాళ్లలో ఉన్న ఓ బిచ్చగత్తే తన పిల్లవాడికి దిష్టి తీస్తోంది.. ""బిచ్చగాడికి దిష్టి""??? ఒక్క క్షణం నవ్వు రాబోయే ఆగిపోయింది బిచ్చ వాళ్ళకి దిష్టా???? ఏముందని??? ఇంతలో మెదడుకి ఏదో తడుతొంది..

ప్రతి వ్యక్తి జీవితమూ ఒక పాఠమే అన్నారు. ఆ బిచ్చగత్తే చేస్తున్న పని ఏదో పాఠం చెబుతోంది.. తల విదిలించాను ..మెట్ల కిందకి ఆర్చి వైఫూ చూశాను. విషయం తేటతెల్లమయింది. గుడి నుంచి బయటకు వచ్చే భక్తులు ముందుగాచదునైన ప్రదేశం లో ఉన్న బిచ్చగాళ్లను దాటుకుని వెళ్ళాలి .కింద మెట్ల దగ్గర కొందరు ,ఆర్చి దగ్గర మరికొందరు బిచ్చగాళ్లు ఎదురవుతారు.. ధర్మం చేయాలనుకునే భక్తులకి ముందుగా చదునైన ప్రదేశంలో ఉన్న బిచ్చగాళ్ళు ఎదురవుతారు. అందువలన వేసేదేదో వాళ్లకే వేస్తారు.

క్రిందనా,దూరంగా ఉన్న వాళ్లకు కూడా వేస్తే వేయొచ్చు. ఆ విధంగా చూస్తే పైన చదునైన ప్రదేశం లో ఉన్న బిచ్చగాళ్ళకి మిగిలిన వాళ్ళ కన్నా ఎక్కువగా ధర్మం పొందే విషయం లో సానుకూల పరిస్థితులు ఉన్నాయి.. అందుకే వారి ప్రదేశంలోకి కొత్త బిచ్చగాళ్ళను రానీ వ్వరు.. క్రిందనున్న వాళ్ళ కన్నా నలుగు డబ్బులు ఎక్కువగానే దొరుకుతాయి.

అందరూ చేసేది యాచించడమే అయినా పైనున్న వాళ్లకు క్రింద ఉన్న వాళ్ళ కన్నా నాలుగు రాళ్లు ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంది. ఆ సానుకూల స్థలంలో వుండటం వలన తన పిల్లవాడి కడుపు నింపుగలుగుతొం ది అందువలన ఆ స్థానానికి భంగం రాకూడదు అని దిష్టి తీస్తూఉండొచ్చు . ఆ బిచ్చగత్తె చేసే పనీ అడుక్కోవడమే అయినా ,తను మిగతా బిచ్చగాళ్ళ కన్నా ఒక మెట్టు పైన ఉంది అంతవరకు తృప్తిపడి దిష్టి తీస్తోంది.

ఇంకా ఇంకా అనువైన ప్రదేశం దొరికితే అక్కడికి వెళ్తుంది.. నాకు చాలా గొప్ప విషయం అవగతం అయింది.. శ్రీమతిని పిలిచాను బిచ్చగత్తే దిష్టి తీయడాన్ని చూపించి ""ఏం అర్థమైంది ""??అని అడిగా.. కారుని ఆస్వాదిస్తున్న ఆమె "" ఏమో నాకేం తెలీదు .మీరే చెప్పండి అంది. ""తను చేసేది అడుక్కోవడమే అయినా మిగతా వాళ్ళు కన్నా తను ఒక మెట్టు ఎక్కువలో ఉన్నానన్న ""తృప్తి ""ఆమెకి కలిగి దిష్టి తీస్తోంది.. రేపు గుడి ముoగిట్లోనే కూర్చొని అవకాశం వేస్తే అక్కడ మారుతుంది. ఉన్నదానికి తృప్తి చెందితే మానసిక ఆరోగ్యం కలిగి మరింత ఎదగడానికి దోహదపడుతుంది.వున్న దానితో తృప్తి చెందక పోతే అనారోగ్యమే.

మనకి కారు లేదు మనకి కారు లేదనీ బాధపడితే అనారోగ్యం .సరే స్కూటర్ ఉందిగా !ఆ స్కూటర్ లేని వాళ్ళ కన్నా మనం మెరుగేగా !అని తృప్తి చెందితే ఆరోగ్యాన్ని ఇస్తుంది. కొంచెం ఓపిక పట్టు .. కారు కూడా తీసుకుందాం.. ఉన్నదానితో తృప్తి చెంది మరింతకు ప్రయత్నించాలని ఆ బిచ్చగత్తే దిష్టి తీయడం పాఠం చెప్పటం లేదా..." అని వివరించాను.

డిన్నర్ పూర్తయ్యాక ఇంటికి బయలుదేరాము. మరలా సన్నగా చినుకులు మొదలయ్యాయి.. మామూలుగా అయితే ""ఇదే కారయితే సరోజా వాళ్ళలా తడిసే వాళ్ళం కాదుగా"!;అని శ్రీమతి సణగాలి. అయితే ఈ సారి సణగ లేదు". " నా దిష్టి పాఠం ఉపయోగ పడిందా.. ఈ ప్రభావం ఇప్పటికేన. రేపు కూడా ఉంటుందా !కాలమే చెప్పాలి .. చూద్దాం."

- పొన్నాడ సత్యప్రకాశ రావు

Tags:    
Advertisement

Similar News