జీవాత్మా, పరమాత్మా
అశాశ్వతమూ, శాశ్వతమూ
కర్మానుసారమూ,
అవతారానుసారమూ
ఎలా అవుతారు ఒక్కటే?
తానే పరమాత్మ నని
నమ్మించే వారూ
అశాశ్వత జీవితానికి
అమితంగా ఆర్జించే వారూ
సర్వం నేనే అనే అహంతో
విర్రవీగే వారూ
అనుచరులు చేస్తే
అవుతారా దేవుళ్ళు?
బ్రతికేవాడూ, బ్రతికించేవాడు
ఆడేవాడూ, అడించేవాడు
మాయలో ఉండేవాడూ,
మాయలో ఉంచే వాడు
ఎలా అవుతారు ఒక్కటే?
తాను బ్రతకక
బ్రతుకులతో ఆడే వారూ
సంపాదనకు కాక
సంపద కోసం ఆడించే వారూ
మాయలో ఉండక
మాయలు చేసే వారూ
అనుచరులు చేస్తే
అవుతారా దేవుళ్ళు?
దేవుడున్నాడా అని
మనిషికి సందేహం
మనిషున్నాడా అని దేవునికి అనుమానం
మనసు కవి పాటలో
విన్నాక కూడా
ఎలా అవుతారు
మనుషులే దేవుళ్ళు?
మనిషి మనిషిగా ఉండీ
మనుషులను
మనుషులుగా ఉండనిచ్చీ
మనిషికి సందేహమూ
దేవునికి అనుమానమూ
రానివ్వనివారినే
దేవుడి లాంటి మనుషులందాము
- వి.విజయకుమార్ (హైద్రాబాద్)