కాళ్లకు చక్రాలు కట్టుకుని
బలాదూర్ గా తిరిగే ఋతువు
వాళ్ళ సొంతం.
'బ్రో 'పల్లవిని
ఎల్లవేళలా ఆలపించే
స్నేహగీతంలోని
సరదా చరణాలు వాళ్ళు.
కలల కొమ్మల మీదకు రేయింబవళ్ళుఆనందంగా ఎగబాకే అల్లరిప్రాయపు
అనురాగాల తీగెలు వాళ్ళు.
అమ్మానాన్నలు పండించుకునే
ఆశల తోటల్లో (నిర్బంధంగా)
విరబూసే మెరిట్ పుష్పాలు వాళ్ళు.
వినీలాకాశంలోకి రాకెట్ లా దూసుకెళ్ళే ర్యాంకుల బాణాలు వాళ్ళు.
పోటీ ప్రపంచంలో
'కే' ల సంపాదనా రేసులో
మునిగి తేలే
టెక్నో చిత్రలేఖినిలు వాళ్ళు
ఒక్క సాఫ్టు వేర్ ఏం కర్మ?
హార్డ్ వేర్ అణిముత్యాలు గా కూడా మెరిసే ప్రతిభా కిరణాలు వాళ్ళు.
కానీ,
ఇప్పుడు వెలిగే భారతంలో మసకబారుతున్న మాదక ద్రవ్యాల
రేవుపార్టీల పడవలకు
బానిస సరంగులై
తెల్లవార్లూ తెల్లబారి పోతున్నారు.
జులాయి పోకిరీ ఇడియట్
నిక్ నేమ్స్ జాబితాల్లో
యంగ్ ఇండియా పేటెంట్ రైట్స్
రిజిస్టర్ చేసుకోటానికి
క్యూ కడుతున్నారు.
నిరుద్యోగమనే వలలో
అసంఘటిత రంగంగా చిక్కి
ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ ఉన్మాదం వైపు అడుగులేస్తోంది.
రాజకీయం ఆడించే
మతమైండ్ గేమ్ లో
ఇప్పుడు యువతరం స్థితి పద్మవ్యూహంలోకి అడుగు పెట్టిన అభిమన్యుని లాగే ఉంది
దాకరపు బాబూరావు
(తిరువూరు)