ఎండలు

Advertisement
Update:2023-04-15 19:50 IST

తన నీడలో తానె

కునికిపాటులు పడు

ఇఱ్ఱి గుండెల యెండ లెఱ్ఱనయ్యె

పచ్చ పచ్చని ఆకు బ్రతుకు చూడగలేక మఱ్ఱిపండుల

కన్ను లెఱ్ఱనయ్యె

పై నుండి నీటి రాబడిలేక సెలకన్నె

చిక్కుచు శల్యావశిష్ట యయ్యె

కౌగింటి వేడిలో క్రాగిన మేనికి

శీతోపచార మాశ్లేష మయ్యెనిప్పు పువ్వుల మోదుగుకొప్పులోన

అడవిజడ యెల్ల ముడివడి అణగియుండె;

ఎండిపోయిన వాగుల నిండిపోయె

నెండమావులు గ్రీష్మంపు టెండలందు.చలిచలి పోయి గాడుపులుసాగిన వేడుపుతోడ

వేడి యూర్పులను వెలార్చుచున్‌; గహనముల్‌ దహనమ్ములబిల్వసాగె,

మావులు కుసుమింపసాగె,

వలపుల్‌ ప్రసవింపసాగె,

డొక్క 'లాకలి, కలి, అంబలీ' అనుచు

క్రమ్మర కేకలు వేయసాగెడిన్‌.

శీతవ్రాత క్రకచముల కోతవడిన

నా నరాల కగ్గిని వెట్ట బూనినాడు

పాడు టెండకాలపు దుండగీడు;

నన్నుపాడుకోనీడు

పూవుల జాడలందు.

శీత మేగగానె చిచ్చు లేతెంచును

చిచ్చు లేగినంత చెట్టు మిట్ట

గట్టు పుట్ట కలిపి కొట్టెడి

జడివానలరుగుదెంచు,

గుండియలు ద్రవించు.

ఏమిటో ఈ జగత్తు! సహింపరానిషడృతు గుణమిది

జీవిత స్వర్గ మెల్ల నరకమైన

విషాద మానవుడు వీడు;

నరపతుల కెల్ల

ఘోరదానవుడు వీడు.

-దాశరథి

Tags:    
Advertisement

Similar News