ఓపిక నశించిన ప్రతిసారీ
నా మనసు ఆకాశంలో కురిసే వెన్నెలకై
ఎదురు చూస్తాను
నమ్మకం కోల్పోయిన ప్రతిసారీ
స్వేదబిందువులు నా కష్టాన్ని గుర్తుచేస్తాయి
నీరసపడిన ప్రతిసారి జఠరాగ్ని కార్చిచ్చులా
కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది
ఒంటరితనం వేధించిన ప్రతిసారీ
మట్టివాసన ఒంటినిండా ప్రవహిస్తుంది
ఆలోచన స్థంభించిన ప్రతిసారీ
గాలి తరగలు నూతనత్వాన్ని సిద్ధింపచేస్తాయి
పంచభూతాలన్నీ పరవశాల గీతాలై
నన్నల్లుకుంటే
వేకువ సూరీడు వేదపారాయణమై దీవిస్తుంటే
కడిగిన ముత్యమై జీవనం కొత్త పయనానికి స్వాగతమంటుంది
-సి.యస్.రాంబాబు
Advertisement