చెద

Advertisement
Update:2022-11-26 19:02 IST

పాత్రలకు పరిధి లేదు

నిర్దిష్ట స్వభావాలూ లేవు

సందర్భాన్నిబట్టి సంఘటనలూ

ప్రభావాన్నిబట్టి ప్రవర్తనలూ

రూపొందుతున్న క్రమంలో

ఏ నిర్వచనమూ నిలవదు

రెండుగాచీలిన మనిషి

భిన్న ధోరణుల మధ్య

కాలంబలాన్నిబట్టి మొగ్గుతుంది

బలం కాలాన్ని అదిమిపట్టిజయిస్తుంది

గెలుపోటములు ద్రవ్యాధీనాలు

రెండే రెండు వర్గాలు

కొంటున్నవాడు అమ్ముకుంటున్నవాడు

కొనడానికి అలవాటుపడ్డ దాహంముందు

అమ్ముకోవడమే లక్ష్యమైన దేహం

సాగిలబడుతుంది

అవసరమొక్కటే ఉత్ప్రేరకమౌతున్నచోట

ఆదర్శాలు కాలంచెల్లిపోతాయి

లొంగుబాటు స్వర్గాలముందు

త్యాగాలు వెలవెలబోతాయి

ఉద్యమాలు ఉత్తుత్తి నినాదాలై రాలిపోతాయి

వర్గాలూ వర్గీకరణలూ

సూత్రాలూ సూత్రీకరణలూ

ఎత్తుగడలకి కొత్త దారులుతెరుస్తున్న చోట

సామూహిక దుఃఖం అనాధ

సామాజికన్యాయం ఎండమావికథ

నలిగిపోయిన పదాలూ

పిగిలిపోయిన వాక్యాలూ

మూగవోయిన హృదయ పరిభాష

బీడుపడ్డ వర్తమానం మీంచి

దొర్లిపోతున్న అక్షరాలవరద

రవంతయినా సారవంతమైన

జాగామిగలకుండా

అంతా ఇసుకమేట

ఎడారికాని ఎడారి

తడారిపోయిన మనుషుల బిడారు

ఆలోచన అంకురించకుండా

చెద చరిత్ర పేజీలకేకాదు

మనుషుల మెదళ్ళకు కూడాపాకింది

డబ్బుచెద

అన్నీమింగేయాలన్నంత ఆకలిచెద

క్షణానికో కొత్తమోసంగా తలెత్తే

రోతరాజకీయం రొద

 - వఝల శివకుమార్

Tags:    
Advertisement

Similar News